గల్లీ to గ్లోబల్ - అన్నం గిన్నెలపై దరువు, అప్పులు చేసి ఆల్బమ్స్: ‘ABP దేశం’తో రాహుల్ సిప్లిగంజ్ తల్లి సుధారాణి
గల్లీ పోరగాళ్లతో కలిసి.. చేతికందిన వస్తువుపై దరువేస్తూ.. చిందులేస్తూ, పాటే ప్రపంచంగా ఎదిగిన ఆ పోరగాడు.. ఆస్కార్ వేదికపై లైవ్‌లో తన గళాన్ని వినిపిస్తాడని ఏనాడు అనుకోలేదు. కనీసం కలగనలేదు.
‘‘నాటు.. నాటు’’ పాటతో ప్రపంచ సినీ జగత్తును ఓ ఊపు ఊపిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రాహుల్ హైదరాబాద్‌లో పాతబస్తీ ఏరియాలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబలో పుట్టాడు. తండ్రి రాజ్ కుమార్ వృత్తి రీత్యా బార్బర్ కావడంతో స్దానికంగా ఓ సెలూన్ నిర్వహిస్తుండేవారు. రాహుల్ కూడా అదే సెలూన్ లో బార్బర్‌గా తండ్రికి సాయం చేసేవాడు. అయితే, రాహుల్‌కు పాటలంటే ఇష్టమని అందరికీ తెలుసు. కానీ, ఆస్కార్ వేదికపై లైవ్‌లో పాడే స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించలేదు. అంత ఎందుకు.. రాహుల్ సిప్లిగంజ్ కూడా ఏనాడు ఊహించలేదు.
సంగీత ప్రియులను ఉర్రూతలూగించే రాహుల్ గొంతు వెనుక అంతులేని కష్టం దాగుందని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగాడు రాహుల్. ‘‘నాటు నాటు’’ పాట ఆస్కార్ అవార్డును గెలిచిన సందర్బంగా రాహుల్ తల్లిదండ్రులను పలకరించింది ABP దేశం. ఈ సందర్బంగా రాహుల్ తల్లి సుధారాణి మాట్లాడుతూ.. రాహుల్‌కు చిన్నవయస్సు నుంచే సంగీతమంటే వల్లమానిన ప్రేమ అని తెలిపారు. ముఖ్యంగా వంట గిన్నెలు, డైనింగ్ టేబుల్స్ పై దరువులేస్తూ సంగీతం నేర్చుకున్నాడని తెలిపారు. అప్పుడు రాహుల్ ఆశక్తిని గమనించిన తండ్రి రాజ్ కుమార్ ప్రోత్సహించడం మొదలు పెట్టారని తెలిపారు.
నలుగురిలో పాడాలంటే మొహమాటం
‘‘రాహుల్ కు చిన్నప్పటి నుంచి మొహమాటం ఎక్కువ. దీంతో ఇంటికి బంధువులు వస్తే వాళ్ల ముందు పాట పాడమంటే తెగ సిగ్గుపడేవాడు. రాహుల్ లో భయం పోగొట్టేందుకు తన తండ్రి పదే పదే బంధువులు వచ్చిన సమయంలో పాడమని అడిగేవాడు. అలా నెమ్మదిగా అలవాటు చేసుకున్న రాహుల్ మొహమాటం వీడి నలుగురులో పాడటం అలవాటు చేసుకున్నాడు. ఇంట్లో వస్తువులనే సంగీత వాయిద్యాలుగా మార్చుకుని సంగీతం నేర్చుకున్నాడు. దసరా ఉత్సవాల్లో రాహుల్ పాటలు పాడేవాడు. ఊరేగింపు లారీపై నిలబడి తన పాటలతో అలరించేవాడు. అలా రాహుల్ ఏడేళ్ల వయస్సులో మొదలైన ఆశక్తి.. ఈరోజు ఈస్దాయికి ఎదిగేలా చేసింది’’ అని తెలిపారు.
అప్పులు చేసి ప్రైవేట్ ఆల్బమ్స్
‘‘రాహుల్ తండ్రి రాజ్ కుమార్ ఓ సెలూన్ నడిపేవారు. సెలూన్ పై వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోతుండేది. రాహుల్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. వస్తువులు తాకట్టు పెట్టి ,అలా తెచ్చిన డబ్బుతో ప్రవేటు ఆల్బమ్స్ చేసేందుకు ఖర్చు చేసేవాళ్లు. ఆ తరువాత వాటి నుండి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చడం, తిరిగి మళ్లీ అవసరమైనప్పుడు వడ్డీకి అప్పులు తెచ్చి రాహుల్ ను ప్రోత్సహించాం’’ అన్నారు.
సెలబ్రిటీగా మారినా.. సెలూన్‌లోనే పనిచేస్తాడు
‘‘RRR సినిమాలో ‘నాటు నాటు’ పాటకు పాడే కీరవాణి గారు అవకాశం ఇవ్వడం మా అదృష్టం. మా బిడ్డలో టాలెంట్ ను గుర్తించి పిలిచి మరీ పాడించారు. ఈ స్దాయికి రాహల్ ఎదిగాడంటే కీరవాణి, మణిశర్మ వంటి ప్రముఖుల ప్రోత్సామం ఎంతో ఉంది. వారికి నా కృతజ్జతలు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడే ఇంట్లో రాహల్ నాతో అనేవాడు. అమ్మా చూడు ఈసారి ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ వస్తుందని చెప్పేవాడు. ఈ రోజు ఆ అవార్డు సాధించినందుకు పట్టలేని ఆనందంలో ఉన్నాం. నా బిడ్డ ఎన్ని పాటలు పాడినా, బిగ్ బాస్ కు వెళ్లినా ఏమాత్రం గర్వంగా ఉండడు. ఇంట్లో తన పని తానే చేసుకుంటాడు. బజారుకెళ్లి సరుకులు తెస్తాడు. తన తండ్రి సెలూన్ కు వెళ్లి, సమయం దొరికినప్పుడల్లా బార్బర్ గా పనిచేస్తుండు. గల్లీ స్థాయి నుంచి ప్రపంచ స్దాయికి నా బిడ్డ గుర్తింపు తెచ్చుకోవడంపై బంధువులు సైతం ఫోన్ లు చేసి అభినందిస్తున్నారు. ఓ తల్లిగా ఇంతకంటే ఏం కావాలి నాకు’’ అని రాహుల్ సిప్లిగంజ్ తల్లి సుధారాణి మురిసిపోయారు.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - నందమూరి తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్