Happy Birthday R Madhavan: మాధవన్ బర్త్ డే స్పెషల్ - మ్యాడీని హీరోగా చేసిన ఈ ఐదు సినిమాలు తప్పక చూడాల్సిందే!
Happy Birthday R Madhavan: తమిళ చాక్లెట్ బాయ్ మాధవన్ పుట్టిన రోజు నేడు. ఆయన కెరియర్ లోనే అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐదు సినిమాలను ఆయన అభిమానులంతా కచ్చితంగా చూడాల్సిందే.
Happy Birthday R Madhavan: తమిళ చాక్లెట్ బాయ్ మాధవన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1970 జూన్ 1వ తేదీన పుట్టిన ఈయన.. నేడు 53వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 1993లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన ఇప్పటికీ హీరోగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నారు. తన అందం, అభినయంతో నేటికీ అమ్మాయిలో మనసులో మన్మథుడిగానే తిష్ట వేసుకొని కూర్చున్నారు. కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా గడిపే ఈయన సవ్యసాచి సినిమాతో తెలుగు సినీ రంగానికి రీఎంట్రీ ఇచ్చారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు సాధించారు. ఆయన కెరియర్ మొత్తంలో ఉన్న బెస్ట్ సినిమాలు, అందరూ చూడాల్సిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.
1. అలైపాయుధె (సఖి)
అలైపాయుధే ఓ తమిళ సినిమా. ఈ చిత్రాన్నే తెలుగులో సఖి సినిమాగా డబ్ చేశారు. 2000 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన ఈ చిత్రంలో మాధవన్ హీరోగా, షాలిని హీరోయిన్ గా చేశారు. జయసుధ, అరవింద్ స్వామి, ఖుష్బూ, కేపీఎసీ లలిత, కలైరాణి కూడా నటించారు. ఇందులో ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అదిరిపోయింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు ప్రేమికులకు ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలిచిపోయింది. మొదటి సినిమాతోనే అధ్భుతమైన నటనను ప్రదర్శించి టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు మాధవన్. ప్రేమించుకోవడం మాత్రమే కాదు జీవితంలో ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా కలిసుండాని.. అప్పుడే జీవితం హ్యాపీగా ఉంటుందని బలంగా చెప్పిందీ సినిమా.
2. మిన్నలే (చెలి)
2001 ఫిబ్రవి 2వ తేదీన విడుదలై మిన్నలే సినిమానే తెలుగులో చెలి చిత్రంగా తీసుకవచ్చారు. ఈ సినిమాతోనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. రీమాసేన్, అబ్బాస్, వివేక్ ఈ చిత్రంలో నటించి మెప్పించగా... హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ప్రేమ కోసం పర్యవసానాల గురించి ఆలోచించకుండా తప్పులు చేస్తుండే కొంటె యువకుడిగా మాధవన్ ఈ సినిమాలో అదరగొట్టాడు.
3. ఇరుతిచుట్టు (గురు)
మాధవన్, రితికా సింగ్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో సుధా కొంగర దర్శకత్వంలో 2016లో విడుదలైన చిత్రం 'ఇరుతిచుట్టు'. ఈ సినిమాలో బాక్సింగ్ రాజకీయాల వల్ల ఒలంపిక్ కలను పోగొట్టుకుని కోపంతో బతికే పాత్రలో మాధవన్ నటించాడు. ట్రైనర్‌గా మారిన తర్వాత కూడా కోపంగా ఉంటూనే జీవితం గడుపుతుంటాడు. అయితే అతను ఉత్తర చెన్నైలోని ఒక మత్స్యకారుల గుడిసెలో ఒక బాక్సర్‌కి గౌరవ శిక్షణ ఇస్తూ.. ఆమెను ఎలా గెలిపించాడనేదే సినిమా కథ. చాక్లెట్ బాయ్, రాకెట్ బాయ్ ఇలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా మాస్ ప్లస్ క్లాస్ యాక్షన్ లో ఇరగదీశారు. అయితే ఇదే సినిమాను తెలుగులో కూడా తెరకెక్కించగా.. విక్టరీ వెంకటేష్ హీరోగా చేశారు.
4. విక్రమ్ వేద
మాధవన్, విజయ్ సేతుపతి, శ్రద్ధా శ్రీనాథ్, కతిర్ మరియు వరలక్ష్మి ప్రధాన పాత్రల్లో పుష్కర్ మరియు గాయత్రి దర్శకత్వంలో 2017లో విడుదలైన చిత్రం 'విక్రమ్ వేద'. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ సినిమాలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. విక్రమాదిత్యన్ వేదాళం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
5. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్
మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటుడిగా కనిపించి మెప్పించిన చిత్రం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈచిత్రంతో మాధవన్ డైరెక్టర్ గా మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. నంబి నారాయణన్... ఇస్రో శాస్త్రవేత్త. ఏపీజే అబ్దుల్ కలాం సహచరుడు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. అయితే... ఆయన జీవితంలో అంతులేని విషాదం ఉంది. సరైన ఆధారాలు లేకుండా ఆయన్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబం పట్ల సమాజం ఎలా ప్రవర్తించింది? ఏమైంది? అనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు మాధవన్. ఇంతకు ముందు చూసిన మాధవన్ సినిమాలో ఎక్కడా ఇలాంటి కథ కనిపించదు.