Gunturu Kaaram Second Heroine : మీనాక్షి, ఫరియా, సంయుక్త - 'గుంటూరు కారం' హీరోయిన్ రేసులో ముగ్గురు?
'గుంటూరు కారం'లో పూజా హెగ్డే బదులు ఎవరిని త్రివిక్రమ్ ఎంపిక చేశారు? మహేష్ బాబు సరసన నటించే అవకాశం ఎవరికి దక్కుతోంది? రేసులో యువ హీరోయిన్లు ముగ్గురి పేర్లు వినబడుతున్నాయి.
ఎవరు? ఎవరు? ఎవరు? మహేష్ బాబుకు జోడీగా నటించబోయే కొత్త కథానాయిక ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie).
'గుంటూరు కారం'లో తొలుత పూజా హెగ్డేను ఓ కథానాయికగా ఎంపిక చేశారు. అది గతంలో! అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఆమె లేరు. అందులో మరో సందేహం లేదు! ఆవిడను తప్పించారా? లేదంటే తప్పుకొన్నారా? అనేది పక్కన పెడితే... పూజ బదులు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రేసులో ముగ్గురు హీరోయిన్లు!
పూజా హెగ్డే బదులు సంయుక్తా మీనన్ (Samyuktha Menon)ను ఎంపిక చేసినట్టు తొలుత వినిపించింది. అయితే... ఆ తర్వాత మీనాక్షి చౌదరి, ఫరియా అబ్దుల్లా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
'గుంటూరు కారం' నిర్మిస్తున్న హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన 'సార్', అంతకు ముందు 'భీమ్లా నాయక్'లో సంయుక్తా మీనన్ నటించారు. 'సార్' సినిమా వేడుకలో సంయుక్తకు త్రివిక్రమ్ సరదాగా ఐ లవ్యూ చెప్పడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అందువల్ల, ఆమె ఎంపిక దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే... కొత్తగా మరో రెండు పేర్లు వచ్చాయి.
Also Read : 'తొలిప్రేమ' వసూళ్ళలో కొంత జనసేన రైతు భరోసా యాత్రకు విరాళంగా...
సుశాంత్ సరసన 'ఇచట వాహనములు నిలుపరాదు'లో మీనాక్షి చౌదరి నటించారు. తెలుగులోనూ, కథానాయికగానూ ఆమెకు తొలి సినిమా అది. ఆ తర్వాత రవితేజతో 'ఖిలాడీ' చేశారు. ఆ రెండూ ఫ్లాప్ అయినప్పటికీ... 'హిట్ 2'తో హిట్ కొట్టారు. మరి, 'గుంటూరు కారం'లో మహేష్ బాబుతో నటించే అవకాశం ఆమెకు వస్తుందో? లేదో? చూడాలి. 'జాతి రత్నాలు' భామ ఫరియా అబ్దుల్లా గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు.
త్రివిక్రమ్ సినిమాల్లో రెండో కథానాయిక అంటే అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, పేరు వస్తుంది. అందువల్ల, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. సంయుక్త, మీనాక్షి, ఫరియా... ముగ్గురిలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుందో? లేదంటే కొత్త కథానాయిక ఎవరైనా వచ్చి చేరతారో? చూడాలి.
Also Read : నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?
శంకరపల్లిలో 'గుంటూరు కారం' కొత్త షెడ్యూల్!
'గుంటూరు కారం' కొత్త షెడ్యూల్ ఈ రోజు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులోని శంకరపల్లి ఏరియాలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసమే భారీ సెట్ వేశారు. అయితే... ఇది చిన్న షెడ్యూల్ అని తెలుస్తోంది. ఇది ముగిసిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని భారీ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట.
మహేష్ బాబుతో పాటు నటుడు రఘుబాబు, నటి ఈశ్వరీ రావు తదితరులు 'గుంటూరు కారం' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హీరో ఇంటి సెట్ లో షూట్ జరుగుతోంది. ఆగస్టు 9న హీరో పుట్టినరోజు. అప్పుడు మేజర్ బ్రేక్ ఉంటుందని తెలిసింది. అది మినహా అక్టోబర్ నెలాఖరు వరకు షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు.