Fighter Movie Trailer: ‘ఫైటర్’ టీజర్ - హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ రోషన్ మూవీ, తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్
Fighter Movie: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజా చిత్రం ఫైటర్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కేవలం హిందీలోనే విడుదల కానుంది.
Sad news for Telugu fans of Hrithik Roshan: ‘విక్రమ్ వేద’ మూవీ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె, సీనియర్ నటుడు అనీల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభించింది.
ఒళ్లు గగుర్పొడిచేలా ‘ఫైటర్’ టీజర్
తాజాగా ‘ఫైటర్’ సినిమా నుంచి అదిరిపోయే టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ ‘టాప్ గన్’ రేంజిలో కనిపిస్తోంది. ఈ టీజర్ లోని యాక్షన్ సీన్లను అద్భుతమైన టెక్నికల్ స్టాండర్డ్స్ తో చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. ఒక్కటంటే ఒక్క డైలాగ్ లేకుండా, టీజర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో నిండిపోయింది. “మమ్మల్ని కనుగొనాలంటే మీరు మంచివారై ఉండాలి. మమ్మల్ని పట్టుకోవాలంటే మీరు వేగంగా ఉండాలి. మమ్మల్ని ఓడించాలంటే మీరు జోక్ చేయాలి” అనే టెక్ట్స్ తో టీజర్ ను రిలీజ్ చేశారు. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ ఫైటర్ జెట్లతో చేసే విన్యాసాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా అనే స్క్వాడ్రన్ ఫైలట్ పాత్రలో కనిపించనున్నారు. దీపికా పదుకొణె స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో హృతిక్, దీపికా మధ్యన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకుల ఒంట్లో సెగలు పుట్టించేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా టీజర్ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తోంది.
కేవలం హిందీలోనే ‘ఫైటర్’ విడుదల
ఇక ‘ఫైటర్’ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే విడుదల చేయనున్నారు. తెలుగు సహా మరే భాషలోనూ విడుదల చేయమని వెల్లడించారు. నిజానికి గత కొంత కాలంగా బాలీవుడ్ లో విడుదలయ్యే చాలా సినిమాలు పలు భాషల్లో విడుదల అవుతున్నాయి. ఇటీవలి బాలీవుడ్ బిగ్గీస్ ‘జవాన్’, ‘యానిమల్’ సినిమాలు తెలుగులోనూ విడుదల అయ్యాయి. తెలుగు వెర్షన్ నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లను అందుకున్నాయి. ‘ఫైటర్’ మేకర్స్ తీసుకున్న నిర్ణయం కారణంగా తెలుగు మార్కెట్ ను కోల్పోయే అవకాశం ఉంది.
‘వార్ 2’ మాత్రం తెలుగులో విడుదల
అటు హృతిక్ రోషన్ మరో చిత్రం ‘వార్ 2’ మాత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా వస్తున్నఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా 2025 ఆగష్టు 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Read Also: రణబీర్ తండ్రిగా రణవీర్, ‘బ్రహ్మాస్త్ర 2’లో దేవ్ అతడేనట!