‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్
కార్తీక్ తన వద్దకు శిష్యుడిగా వచ్చినపుడు అతనికి ఓ ఆరోగ్య సమస్య ఉందని, కేవలం ఓ ఐదారు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారని దర్శకుడు సుకుమార్ అన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిచింది. ఈ మూవీ తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బాగుండటంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవలే ‘విరూపాక్ష’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దర్శకడు కార్తీక్ దండు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘విరూపాక్ష’ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా కోసం టీమ్ చాలా కష్టపడిందని, కష్టానికి తగ్గట్టుగానే సినిమా చాలా బాగా వచ్చిందన్నారు సుకుమార్. కార్తీక్ తన వద్దకు శిష్యుడిగా వచ్చినపుడు అతనికి ఓ ఆరోగ్య సమస్య ఉందని అన్నారు. కేవలం ఓ ఐదారు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారని, కానీ తాను చనిపోయేలోపు ఎలాగైనా ఓ సినిమాకు దర్శకత్వం వహించి చనిపోవాలని కార్తీక్ అనేవాడని గుర్తుచేసుకున్నారు సుకుమార్. ఎప్పుడూ స్టెరాయిడ్స్ తీసుకొని బతికేవాడని, అవి ఇవ్వకపోతే అతని ప్లేట్ లెట్స్ పడిపోయి చనిపోతాడని అన్నారు. తనకున్న సమస్యను కూడా పట్టించుకోకుండా సినిమా కోసం కష్టపడేవాడని అన్నారు. అలాంటి కార్తీక్ ఇప్పుడు తన ఆరోగ్య సమస్యను అధిగమించి ఓ సినిమాకు దర్శకత్వం వహించడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్తీక్ ఆరోగ్య విషయంలో అతని తల్లి ఎంతో కష్టపడిందని, బహుశా ఆ తల్లి దీవెనలే కార్తీక్ ను మళ్లీ నిలబెట్టాయని అన్నారు. మొదట్లో కార్తీక్ తన వద్దకు ఓ కథతో వచ్చాడని, అయితే తనకు ఆ కథ నచ్చకపోవడంతో మరో కథ తయారు చేసుకొని రమ్మని చెప్పానని అన్నారు. అయితే కార్తీక్ కథ చాలా బాగా చెప్పాడని అనిపించిందని అన్నారు. కార్తీక్ కథ చెబుతుంటే ఎవరైనా అలా ఉండిపోతారని అన్నారు. అందుకే సినిమాను కూడా చాలా బాగా తీశాడని పేర్కొన్నారు సుకుమార్. ఈ సందర్భంగా కార్తీక్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సుకుమార్ శిష్యుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇటీవల ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు శ్రీకాంత్. ఇక ‘ఉప్పెన’ సినిమాతో సంచలన విజయం అందుకున్న బుచ్చిబాబు సనా కూడా సుకుమార్ శిష్యుడే. అలాగే ‘కుమారి 21ఎఫ్’, ‘18 పేజెస్’ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే. వీరంతా దర్శకులుగా మారి మంచి హిట్ లను అందుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి కార్తీక్ దండు కూడా రానున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21 న పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతోంది. మరి ఈ మూవీతో కార్తీక్ కు ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి.