Dharmendra Legal Heir: ధర్మేంద్ర ఆస్తికి అసలైన వారసుడు ఎవరు? హేమామాలినికి వాటా ఎందుకు లేదు? 450 కోట్లు ఎవరికి వెళతాయి? చట్టం ఏం చెబుతోందంటే?
దివంగత బాలీవుడ్ హీరో ధర్మేంద్రకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అలాగే, 450 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అందులో ఎవరి వాటా ఎంత? చట్టం ఏమి చెబుతోంది? అంటే...

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఆస్తి విలువ 450 కోట్లు. ఆయనకు పలు ప్రాంతాల్లో ప్రోపర్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మరణించిన నేపథ్యంలో ఎవరికి ఎంత వాటా వస్తుంది? అనే చర్చ మొదలైంది. ధర్మేంద్రకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. మరి, ఆయన ఆస్తిలో ఎవరికి ఎక్కువ హక్కు ఉందో తెలుసుకుందాం.
ధర్మేంద్ర ఆస్తిపాస్తులు ఎంత?
బాలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం... ధర్మేంద్ర ఆస్తి విలువ 400 నుండి 450 కోట్ల రూపాయలు. ఆయన 89 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటించారు. ఆయన చిత్రం 'ఇక్కిస్' ఈ సంవత్సరం డిసెంబర్ 25న విడుదల కానుంది. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆయన డబ్బులు సంపాదించారు. దీనితో పాటు ముంబైలో ఆయనకు ఒక లగ్జరీ బంగ్లా ఉంది. అలాగే ఖండాలా, లోనావాలాలో ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. ఆయనకు మరికొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా ఉన్నాయి. పాపులర్ రెస్టారెంట్ చైన్ గరం - ధరం నడుపుతున్నారు. అలాగే, ధర్మేంద్ర దగ్గర మెర్సిడెస్ బెంజ్ ఎస్ - క్లాస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వంటి చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి.
ధర్మేంద్రకు పిల్లలు ఎంత మంది?
ధర్మేంద్ర రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య పేరు ప్రకాష్ కౌర్. రెండవ భార్య డ్రీమ్ గాళ్ హేమా మాలిని. ఇద్దరు భార్యల ద్వారా ధర్మేంద్రకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య ద్వారా ధర్మేంద్రకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ నలుగురూ ఎవరంటే... సన్నీ డియోల్, బాబీ డియోల్, అజీతా డియోల్, విజేతా డియోల్. రెండవ భార్య హేమా మాలిని ద్వారా ధర్మేంద్రకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అమ్మాయిల పేర్లు ఈషా డియోల్, అహానా డియోల్.
Also Read: ధర్మేంద్ర ఆస్తిలో హక్కు గానీ, ఆయన పెన్షన్ గానీ హేమా మాలినికి రాదు - ఎందుకంటే?

ధర్మేంద్రకు 13 మంది మనవళ్లు, మనవరాళ్లు!
- సన్నీ డియోల్: ఇద్దరు కుమారులు, కరణ్ డియోల్ మరియు రాజ్‌వీర్ డియోల్.
- బాబీ డియోల్: ఇద్దరు కుమారులు ధర్మ మరియు ఆర్యమన్ డియోల్.
- అజీతా డియోల్: ఇద్దరు కుమార్తెలు.
- విజేతా డియోల్: ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె.
- ఈషా డియోల్: ఇద్దరు కుమార్తెలు- రాధ్యా తక్తానీ మరియు మిరాయా తక్తానీ.
- అహానా డియోల్: డెరిన్ వోహ్రా (కుమారుడు). కవల కుమార్తెలు- అస్త్రియా వోహ్రా మరియు ఆడియా వోహ్రా ఉన్నారు.
అలాంటప్పుడు, ధర్మేంద్ర ఆస్తిని విభజిస్తే, దానిని ఎవరు పొందుతారు అనే ప్రశ్న తలెత్తుతుంది?
ఆస్తి విభజన గురించి చట్టం ఏమి చెబుతోంది?
ఆస్తి విభజన గురించి ఢిల్లీ హైకోర్టు న్యాయవాది కమలేష్ కుమార్ మిశ్రా ABP న్యూస్‌తో మాట్లాడుతూ... ''2023లో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు 'రెవాన్‌సిద్దప్ప వర్సెస్ మల్లికార్జున (2023 INSC 783)'లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది'' అని తెలిపారు. ఆ అంశంలోకి వెళితే...
సుప్రీం కోర్టు తీర్పు ఏమి చెబుతోంది?
సుప్రీం కోర్టు 2023 నాటి తీర్పు ప్రకారం... ఒక వ్యక్తి రెండవ వివాహం హిందూ వివాహ చట్టం (HMA) ప్రకారం చెల్లనిదిగా పరిగణించబడితే (ధర్మేంద్ర మరియు హేమా మాలిని వివాహం వలె... ఎందుకంటే మొదటి భార్య ప్రకాష్ కౌర్ జీవించి ఉన్నారు, విడాకులు తీసుకోలేదు), అప్పుడు కూడా ఆ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు చట్టం దృష్టిలో చెల్లుబాటు అవుతారు.
సెక్షన్ 16 (1) ప్రకారం, అటువంటి పిల్లలు తమ తల్లిదండ్రుల ఆస్తిపై పూర్తి హక్కును కలిగి ఉంటారు. అయితే, ఈ హక్కు తల్లిదండ్రుల ఆస్తికి మాత్రమే పరిమితం చేయబడుతుంది - అంటే మొత్తం ఉమ్మడి కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తిపై ప్రత్యక్ష హక్కు ఉండదు.

ఈషా, అహానాకు ధర్మేంద్ర ఆస్తిలో వాటా వస్తుందా?
న్యాయవాది కమలేష్ కుమార్ మిశ్రా చెప్పిన వివారల ప్రకారం... 'రెండవ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు' తమ తండ్రి స్వయం - ఆర్జిత, పూర్వీకుల ఆస్తిలో వాటాకు అర్హులు.
చట్టపరమైన భాషలో దీనిని 'కాల్పనిక విభజన' (Notional Partition) అంటారు. అంటే... ధర్మేంద్రకు అతని పూర్వీకుల ఆస్తిలో వచ్చిన వాటా గనుక ఉంటే... ఆ వాటా అతని చట్టబద్ధమైన వారసులందరికీ సమానంగా పంపిణీ చేయబడుతుంది.
చట్టం దృష్టిలో ఈషా, అహానా పరిస్థితి ఎలా ఉందంటే?
- చట్టబద్ధత ఉందా?: హేమా మాలినితో ధర్మేంద్రది రెండవ వివాహం. హిందూ వివాహ చట్టం (HMA) ప్రకారం చెల్లనిదిగా (శూన్యం) పరిగణించబడుతోంది. ఎందుకంటే... అతని మొదటి వివాహం ప్రకాష్ కౌర్‌తో కొనసాగుతోంది గనుక. HMA యొక్క సెక్షన్ 16(1) ధర్మేంద్ర కుమార్తెలకు వారి తల్లిదండ్రులకు సంబంధించి చట్టబద్ధమైన పిల్లల హోదాను ఇస్తుంది.
- ఆస్తిపై పరిమితి (సెక్షన్ 16(3)): సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తీర్పు ప్రకారం... చట్టబద్ధత హోదా వారిని పెద్ద హిందూ ఉమ్మడి కుటుంబంలో సహాధికారులుగా (కోపార్సనర్‌లు) చేయదు. వారి హక్కులు ఖచ్చితంగా వారి తల్లిదండ్రుల (ధర్మేంద్ర మరియు హేమా మాలిని) ఆస్తికి మాత్రమే పరిమితం చేయబడతాయి, "తల్లిదండ్రులు కాకుండా మరెవరైనా" ఆస్తికి కాదు.
పూర్వీకుల ఆస్తిలో వారసత్వ హక్కు (వివరణ)
న్యాయవాది కమలేష్ కుమార్ మిశ్రా చెప్పిన వివరాల ప్రకారం... 'సుప్రీంకోర్టు 2023 నాటి తీర్పును గమనిస్తే? చెల్లని వివాహం ద్వారా కలిగిన సంతానానికి తల్లిదండ్రుల పూర్వీకుల లేదా సహాధికారుల ఆస్తిలో వాటాకు ఎలా అర్హులవుతారో స్పష్టమైన మార్గాన్ని చూపించింది. ఇది ప్రత్యేకంగా HMA యొక్క సెక్షన్ 16(3) మరియు హిందూ వారసత్వ చట్టం (HSA) యొక్క సెక్షన్ 6(3) మధ్య సమన్వయాన్ని ఏర్పరచింది'
1. కాల్పనిక విభజన అవసరం: ఒక హిందూ పురుషుడు సహాధికారి (ధర్మేంద్ర వంటి) మరణించినప్పుడు, HSA యొక్క సెక్షన్ 6(3) ప్రకారం, మితాక్షర సహాధికారి ఆస్తి యొక్క కాల్పనిక విభజన (నోషనల్ పార్టీషన్) అతని మరణానికి కొద్దికాలం ముందు జరిగిందని భావించబడుతుంది.
2. తల్లిదండ్రుల ఆస్తిని నిర్ణయించడం: ఈ కాల్పనిక విభజనలో ధర్మేంద్రకు వచ్చిన వాటాను వారసత్వ ప్రయోజనాల కోసం అతని "ఆస్తి"గా పరిగణిస్తారు.
3. బదిలీ: ఈ విధంగా నిర్ణయించిన వాటా పంపిణీ, వీలునామా లేకుండా వారసత్వం (HSA యొక్క సెక్షన్ 8 మరియు 10 ప్రకారం), ధర్మేంద్ర యొక్క అన్ని క్లాస్-1 వారసులలో జరుగుతుంది.
4. సెక్షన్ 16 పిల్లలను చేర్చడం: HMA యొక్క సెక్షన్ 16(1) ప్రకారం చట్టబద్ధత పొందిన పిల్లలు (ఈషా డియోల్ - అహానా డియోల్), HSA యొక్క సెక్షన్ 10 ప్రకారం విభజన కోసం "కుమారులు", "కుమార్తెలు"గా పరిగణించబడతారు, ఇది చట్టబద్ధమైన సెక్షన్ 16 పిల్లల మధ్య తేడాను చూపించదు.
5. హక్కులపై ముగింపు: కాల్పనిక విభజన తర్వాత ధర్మేంద్ర వాటాలో వచ్చిన ఆస్తిలో ఈషా డియోల్ - అహానా డియోల్, అతని ఇతర క్లాస్-1 వారసులతో (అతని మొదటి భార్య ప్రకాష్ కౌర్, జీవించి ఉంటే? అతని తల్లి, జీవించి ఉంటే? మొదటి వివాహం పిల్లలు: సన్నీ, బాబీ, విజేతా, అజీతా) సమాన వాటాకు అర్హులు.
ధర్మేంద్ర ఆస్తికి ఎవరు అర్హులు అవుతారు?
మొదటి భార్య ప్రకాష్ కౌర్, అతని పిల్లలు - సన్నీ, బాబీ, అజీతా, విజేతాతో పాటు రెండవ భార్య హేమా మాలిని ఇద్దరు కుమార్తెలు - ఈషా డియోల్, అహానా డియోల్. వీరందరూ ధర్మేంద్ర వాటాలో వచ్చిన ఆస్తిలో సమాన హక్కును కలిగి ఉంటారు.
- మొదటి భార్య: ప్రకాష్ కౌర్
- మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం: సన్నీ డియోల్, బాబీ డియోల్, అజీతా డియోల్, విజేతా డియోల్
- రెండవ వివాహం ద్వారా జన్మించిన కుమార్తెలు: ఈషా డియోల్, అహానా డియోల్
ఈ ఆరుగురు పిల్లలు తమ తండ్రి ధర్మేంద్ర వాటా ఆస్తిలో సమాన వాటా పొందుతారు.
హేమా మాలినికి ఆస్తిలో వాటా రాదు
ధర్మేంద్ర ఆస్తిలో హేమా మాలినికి వాటా రాదు. ఎందుకంటే... ధర్మేంద్రతో ఆమె వివాహం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదు (ధర్మేంద్ర మొదటి వివాహం అప్పటికి కొనసాగుతోంది). హేమా మాలినికి వాటా రావాలంటే ధర్మేంద్ర వీలునామా రాసి ఆమెకు వాటా ఇవ్వాలి లేదా వివాహం యొక్క చట్టబద్ధతను కోర్టులో నిరూపించాలి. అయితే హేమా మాలిని పిల్లలకు వాటా వస్తుంది. ''సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... చెల్లని వివాహం ద్వారా జన్మించిన పిల్లలకు ఇప్పుడు కేవలం పేరు మాత్రమే కాదు, చట్టపరమైన హక్కుతో ఆస్తిలో వాటా లభిస్తుంది. ఈషా, అహానా డియోల్... ఇద్దరూ తమ తండ్రి ధర్మేంద్ర వాటాలోని మొత్తం ఆస్తిలో సమాన వాటాకు అర్హులు'' అని న్యాయవాది కమలేష్ కుమార్ మిశ్రా తెలిపారు.





















