Devil Movie Sets : 'డెవిల్' - కళ్యాణ్ రామ్ సినిమా కోసం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ సెట్స్!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'డెవిల్'. ఈ కథ దేశానికి స్వాతంత్య్రం రాకముందు సాగుతుంది. ఆ కాలాన్ని ప్రతిబింబించే విధంగా కళా దర్శకుడు గాంధీ సెట్స్ వేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'డెవిల్' (Devil Movie). బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు... 1940ల కాలంలో చిత్ర కథ సాగుతుంది. చారిత్రక నేపథ్యంలోని కథతో తెరకెక్కుతున్న సినిమా అన్నమాట.
పీరియాడిక్ ఫిల్మ్ అంటే ఆ కాలాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేయాలి కదా! 'డెవిల్' కోసం ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ (Gandhi Nadikudikar) ఆ పని చేశారు. ఆయన వేసిన ఒక్కో సెట్ చూస్తుంటే... ప్రేక్షకుల మైండ్ బ్లాక్ కావడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి, రెండు, మూడు... పది, పదిహేను, ఇరవై కాదు... 'డెవిల్' కోసం ఏకంగా 80 సెట్స్ వేశారు.
ఆంధ్ర క్లబు... కార్గో షిప్పు...
లైటు హౌసు... 9 ట్రక్కుల వుడ్డు!
'డెవిల్' కోసం 1940 కాలాన్ని ఆవిష్కరించేలా... బ్రిటిష్ పరిపాలనలో మన దేశాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేయటం తనకు ఎంతో సవాలుగా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ కమ్ ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ పేర్కొన్నారు. మొత్తం 80 సెట్స్ వేసినట్లు ఆయన తెలిపారు.
'డెవిల్' సెట్స్ కోసం తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి అవసరమైన సామాగ్రిని తెప్పించారు. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు తెలుగు రాష్ట్రాలు ఏర్పడలేదు. మద్రాసు ప్రావిన్సులో ఉన్నాయి. అప్పట్లో మద్రాసులోని ఆంధ్ర క్లబ్ ఫేమస్. ఆ క్లబ్ సెట్, విశాఖలోని లైట్ హౌస్ సెట్, అప్పటి నేవీ అధికారుల ఆఫీసు, కార్గో షిప్ వంటివి 'డెవిల్' కోసం ప్రత్యేకంగా రూపొందించారు. నిర్మాత అభిషేక్ నామా మద్దతు లేకుండా ఈ స్థాయిలో భారీ సెట్స్ వేయడం సాధ్యమయ్యే పని కాదని, సినిమాను ఇంత ఖర్చుతో అసలు తీయలేమని గాంధీ నడికుడికర్ తెలిపారు.
Also Read : 'డెవిల్' కోసం వేసిన ఆంధ్రా క్లబ్ సెట్ ఫొటోలను చూడండి!
'డెవిల్' సెట్స్ గురించి గాంధీ నిడికుడికర్ మాట్లాడుతూ ''ఈ సెట్స్ వేయటానికి 9 ట్రక్కుల కలపను తెప్పించాం. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10 వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్ సైతం ఉపయోగించాం. మేం 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్, బ్రిటిష్ కాలాన్ని ప్రతిబింబించే 10 వింటేజ్ సైకిల్స్, ఓ వింటేజ్ కారు, బ్రిటిష్ కవర్ డిజైనుతో ఉన్న 500 పుస్తకాలు, 1940 కాలానికి చెందిన కార్గో షిప్, విశాఖ సముద్ర తీర ప్రాంతంలో 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ తదితర సెట్స్ వేశాం'' అని చెప్పారు.
Also Read : పవన్ కళ్యాణ్ లుక్ & గన్స్ నుంచి కథ వరకు - 'ఓజీ' టీజర్‌లో ఇవి గమనించారా?
నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నవంబర్ 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha menon) కథానాయికగా నటించారు. 'బింబిసార' తర్వాత మరోసారి వీళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రమిది. 'డెవిల్' సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, కూర్పు : తమ్మిరాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర్ రాజన్ .ఎస్, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial