Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Nizamabad News: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని బోర్డు ఛైర్మన్‌గా నియమించగా.. మూడేళ్లు ఆయన పదవిలో కొనసాగనున్నారు.

Central Government Set Up Turmeric Board In Nizamabad: పండుగ పూట రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిజామాబాద్ జిల్లా వాసులు, అన్నదాతల ఏళ్ల కల సాకారమైంది. నిజామాబాద్‌లో (Nizamabad) జాతీయ పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మంగళవారం జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్.. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని నియమించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అటు రైతులు, ఇటు నిజామాబాద్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ ప్రయోజనాలు
పసుపు బోర్డు ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్మెంట్ మార్కెట్ వరకూ రైతులకు లబ్ధి కలుగుతుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు. పసుపు తవ్వకం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, డ్రై చేయడానికి అవసరమైన యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా ప్రతి సీజన్‌లోనూ దాదాపు 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది.
అటు, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం అధికారికంగా పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం కానుందని చెప్పారు. పసుపు రైతుల దశాబ్దాల కలను కేంద్రం నెరవేర్చిందని అన్నారు.





















