Chiranjeevi: ఒలింపిక్ విజేతకు మెగా ప్రోత్సాహం... అకాడమీకి వెళ్లి మరీ 3 లక్షలు ఇచ్చిన చిరంజీవి
చిరంజీవి తనది మెగా మనసు అని మరోసారి చాటి చెప్పడమే కాదు... ఒలింపిక్ విజేతకు మూడు లక్షల రూపాయల చెక్ అందించడం పట్ల ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు.
సినిమాలు చూసే ప్రేక్షకులలో మాత్రమే కాదు... ఒలింపిక్ విజేతలలోనూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు ఉన్నారు. అభిమానులను తన కుటుంబ సభ్యులుగా భావించే చిరంజీవి వాళ్లకు అంతే ప్రాముఖ్యం ఇస్తారు. అందుకు మరో ఉదాహరణ... పారా ఒలింపిక్ విజేత దీప్తి జీవాంజిని కలవడానికి చిరు స్వయంగా వెళ్లడం.
దీప్తి జీవాంజికి మూడు లక్షల ప్రోత్సాహం అందించిన చిరు
దీప్తి జీవాంజి (Deepthi Jeevanji)... పారా అథ్లెట్. మన తెలుగు బిడ్డ. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో గల కల్లెడ గ్రామంలో జన్మించింది. గత ఏడాది (2024)లో జరిగిన పారా ఒలింపిక్ పోటీల్లో 400 మీటర్ల టీ20 రేసులో కాంస్య పతకం సాధించి... మన దేశానికి, తెలుగు ప్రజలకు గౌరవం తెచ్చింది.
వరంగల్‌లోని చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన దీప్తి జీవాంజి చిరంజీవి అభిమాని. ఆమె ఒలింపిక్ మెడల్ సాధించిన సందర్భంగా 'మీకేం కావాలి?' అని ఇండియన్ నేషనల్ బాడ్మింటన్ టీమ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అడిగారు. అప్పుడు దీప్తి ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా? ''చిరంజీవి గారిని కలవాలని ఉంది'' అని! ఆ విషయాన్ని చిరు దృష్టికి తీసుకు వెళ్లారు పుల్లెల గోపీచంద్. అప్పుడు ఏమైందంటే?
''ఇటీవల నేను చిరంజీవి గారిని ఒక సందర్భంలో కలిశా. అప్పుడు దీప్తి జీవాంజి గురించి చెప్పాను. 'ఆ అమ్మాయి గొప్ప ఘనత సాధించింది. అటువంటప్పుడు ఆమె రావటం కాదు... నేను అకాడమీకి వస్తాన'ని అన్నారు. అన్నట్లుగా చిరంజీవి గారు మా అకాడమీకి వచ్చారు. అక్కడ ఉన్న పిల్లలు అందరినీ కలిశారు. రెండు గంటల పాటు మా అకాడమీలో గడిపారు. ప్రతి ఒక్క ప్లేయర్ ఎంతో స్ఫూర్తి పొందేలా ఆయన మాట్లాడారు. అంతే కాదు... దీప్తి జీవాంజికి మూడు లక్షల రూపాయల చెక్ అందించి మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు'' అని పుల్లెల గోపీచంద్ చెప్పారు.
చిరు స్పందన తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పుల్లెల గోపీచంద్ వాయిస్ నోట్ విడుదల చేశారు. చిరంజీవి తమ అకాడమీకి రావడం, దీప్తికి కొంత మొత్తం ఇవ్వడం క్రీడాకారులకు చిరంజీవి గారు ఇచ్చిన గొప్ప గౌరవంగా తాను భావిస్తానని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తాను భావిస్తున్నాట్లు పుల్లెల గోపీచంద్ తెలిపారు.
Also Read: అమెరికాలో కన్ను మూసిన టాలీవుడ్ డైరెక్టర్... ఆవిడ తీసిన సినిమాలు ఏమిటో తెలుసా?