'ఆదిపురుష్' ఓ అద్భుతం - సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతారు : శరత్ కేల్కర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ కేల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' కోసం ప్ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మొట్టమొదటిసారి ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనుండగా.. సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను రాబట్టింది. ట్రైలర్లో రాముడిగా ప్రభాస్ లుక్స్ తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ అందరినీ ఆకట్టుకోవడంతో ట్రైలర్ ఒక్కసారిగా సినిమా పై అంచనాలను పెంచేసింది.
'ఆదిపురుష్' అద్భుతంగా ఉంది - శరత్ కేల్కర్
అయితే తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు శరత్ కేల్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. 'ఆదిపురుష్' సినిమా అద్భుతంగా ఉందని, సినిమాకి తుదిమెరుగులు దిద్దిన తర్వాత సినిమా చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని అన్నారు. 'ఆదిపురుష్' సినిమాకి హిందీ వర్షన్ లో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు శరత్ కేల్కర్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' గురించి మాట్లాడుతూ.. "నేను డబ్బింగ్ చెప్పడంలో భాగంగా 'ఆదిపురుష్' సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాకి తుది మెరుగులు దిద్దిన తర్వాత సినిమా చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. సినిమాలో ఉన్న కంటెంట్, ఆ కంటెంట్ ని తెరకెక్కించిన విధానం అన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక 'ఆదిపురుష్' డబ్బింగ్ అంతా కంప్లీట్ అయ్యాక నేను ప్రభాస్ ను కలిసాను. ఆయన నన్ను ఎంతో ఆప్యాయంగా హత్తుకుని డబ్బింగ్ చాలా బాగా చెప్పావని అన్నారు. అదే నాకు ప్రభాస్ నుంచి వచ్చిన అతిపెద్ద ప్రశంసగా నేను భావించాను" అంటూ చెప్పుకొచ్చాడు శరత్ కేల్కర్. ఈయన కామెంట్స్ తో 'ఆదిపురుష్'పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
'బాహుబలి' టూ 'ఆదిపురుష్' డబ్బింగ్
ఇక శరత్ కేల్కర్ తెలుగు హీరోలకు హిందీలో డబ్బింగ్ చెప్పడం ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఇక ప్రభాస్ పాత్రకు శరత్ కేల్కర్ గొంతు సరిగ్గా సరిపోతుందని భావించిన మొదటి వ్యక్తి మన ఎస్ ఎస్ రాజమౌళి. ప్రభాస్ కి మొట్టమొదటిగా 'బాహుబలి' సినిమాకి హిందీ వర్షన్ లో డబ్బింగ్ చెప్పాడు శరత్ కేల్కర్. అప్పటి నుంచి ఇప్పటి 'ఆదిపురుష్' వరకు ప్రభాస్ కి హిందీలో డబ్బింగ్ చెబుతూ వస్తున్నాడు. ప్రభాస్ కే కాదు ఇటీవల నాచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' సినిమాలోని నాని పాత్రకి కూడా హిందీ వర్షన్ లో ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఇక ఆదిపురుష్ సినిమాని టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా సుమారు 550 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. జూన్ 16న తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read: Pushpa-2: ప్రతీకారంతో తిరిగొస్తున్న భన్వర్ సింగ్ షెకావత్ - 'పుష్ప 2' క్రేజీ అప్‌డేట్