Nawazuddin Siddiqui: డబ్బులు తీసుకుని న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నా - సౌత్ సినిమాలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ కామెంట్స్
Nawazuddin Siddiqui: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ 'సైంధవ్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్ లో నటించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Nawazuddin Siddiqui: బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి పాత్ర అయినా సరే, దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి తన విలక్షణమైన నటనతో మెస్మరైజ్ చేసే వర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నారు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నారు. కానీ సౌత్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధిఖీ ఓ ఇంటర్వ్యూలో దక్షిణాదిలో నటించడం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదించడం కోసమే తాను సినిమాల్లోకి రాలేదంటూనే, సౌత్ లో మంచి రెమ్యునరేషన్ ఇస్తారనే నటించానని చెప్పారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. డబ్బు సంపాదించడం కోసం తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదని, యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చానని తెలిపారు. తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రతీ పాత్రకు న్యాయం చేసి సినీ ప్రియులను అలరించడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. ‘రామన్ రాఘవ్’ లాంటి చిత్రాల్లో నటిస్తున్నప్పుడు తన పాత్రకు సంబంధించిన భావోద్వేగాలు, ఆలోచనలపై తనకు పట్టు ఉంటుందని చెప్పారు. కానీ సౌత్ సినిమాల్లో నటించినప్పుడు మాత్రం ఈ విషయాన్ని తాను కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు.
దక్షిణాదిలో మంచి పారితోషికం ఇస్తారనే కారణంగానే ఆయా చిత్రాల్లో నటిస్తున్నట్లుగా నవాజుద్దీన్ సిద్ధిఖీ వెల్లడించారు. నిర్మాతలు ఎక్కువ డబ్బులు ఇస్తున్నప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో తనకు అర్థమయ్యేది కాదని, అక్కడ పాత్రలపై పూర్తి నియంత్రణ ఉండటం లేదని తెలిపారు. తాను ఏం చేయాలనే విషయాన్ని షూటింగ్ కు ముందు మరో వ్యక్తి వివరించాల్సి వస్తోందని, డబ్బులు తీసుకుంటున్నా తన పాత్రకు సరైన న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని, గిల్టీగా ఫీల్ అవుతున్నానని సిద్ధిఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమా 'పేట'తో నవాజుద్దీన్ సిద్దిఖీ సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘సైంధవ్’ సినిమాతో నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సిద్ధిఖీ పాత్రపై, ఆయన డబ్బింగ్ పై విమర్శలు వచ్చాయి. అయితే సౌత్ సినిమాల్లో తన పాత్ర గురించి పూర్తి అవగాహన, పట్టు సాధించలేకపోతున్నానని నవాజుద్దీన్ అంటున్నారు.
1999లో 'సర్ఫారోష్' చిత్రంతో సినీరంగం ప్రవేశం చేసాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. షూల్, జంగిల్, మున్నాభాయ్ MBBS, దేవ్ డి, పీప్లీ లైవ్, ది బైపాస్, కహానీ, పాన్ సింగ్ తోమర్ వంటి హిందీ చిత్రాలతో అలరించారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' సిరీస్ ఆయన్ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. రామన్ రాఘవ 2.0, బద్లాపూర్, కిక్, భజరంగీ బాయిజాన్, మాంఝీ, మామ్, రాత్ అకేలీ హై లాంటి చిత్రాలు సిద్దిఖీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల 'రౌతు కా రాజ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
Also Read: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలుసా?