Vicky Kaushal: కత్రినా భర్త విక్కీ కౌశల్‌ను చుట్టుముట్టిన ఇసుక మాఫియా - 500 మందితో దాడికి యత్నం, చివరికి...
Vicky Kaushal: 'బ్యాడ్ న్యూస్' సక్సెస్ జోష్ లో ఉన్న విక్కీ కౌశల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అసిస్టెంట్ డైరక్టర్ గా చేస్తున్నప్పుడు తనకు ఎదురైన విచిత్రమైన సంఘటనను పంచుకున్నారు.
Vicky Kaushal: బాలీవుడ్ యాక్టర్, నటి కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా తెరంగేట్రం చేయడానికి ముందు కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు విక్కీ. స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినట్లుగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను విక్కీ తెలిపాడు. అప్పుడు ఇసుక మాఫియా చేతిలో దాదాపుగా దెబ్బలు తిన్నాననే విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.
విక్కీ కౌశల్ మాట్లాడుతూ “గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాలో చూపించిన బొగ్గు స్మగ్లింగ్ ను మేము రియల్ గా షూట్ చేశాం. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన సన్నివేశాలను తీయడానికి వెళ్లినప్పుడు ఓ సంఘటన జరిగింది. అది చూసి నేను అయోమయంలో పడ్డాను. ఎందుకంటే బహిరంగంగానే ఇసుక స్మగ్లింగ్‌కు పాల్పడటం నేను మొదటి సారి చూసాను. అక్కడ కేవలం రెండు ట్రక్కులు మాత్రమే నిలబడలేదు.. దాదాపు 500 ట్రక్కులు వరకు ఉన్నాయి. చూస్తే ఇదేదో సరిగ్గా నడిచే వ్యాపారం అని మీరు అనుకుంటారు" అని చెప్పారు.
“మేము వారిని రహస్యంగా షూట్ చేస్తున్నప్పుడు కొంతమంది మా దగ్గరకు వచ్చారు. దాదాపు 500 మంది మమ్మల్ని చుట్టు ముట్టారు. కెమెరా అటెండెంట్ దాదాపు 50 ఏళ్లు పైబడిన ఓల్డ్ మ్యాన్. మేము ఇక్కడ అనుకోని పరిస్థితిలో చిక్కుకున్నాం అని ఆ వ్యక్తి యూనిట్‌కి ఫోన్ చేశాడు. అతను ఫోన్‌లో మాట్లాడటం విని, ఎవరో పెద్దవాళ్ళకు కాల్ చేస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. ఆ ముఠాకు చెందిన ఓ వ్యక్తి వచ్చి మా కెమెరామెన్ ని చెంప మీద కొట్టాడు. కెమెరా లాక్కొని, కెమెరా పగలగొడతామని మమ్మల్ని బెదిరించాడు. మమ్మల్ని కొట్టబోతుంటే ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాం" అని విక్కీ కౌశల్ తెలిపారు.
Also Read: RRR రికార్డును బ్రేక్ చేసిన 'కల్కి 2898 AD'
అలాగే బెనారస్ స్టేషన్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు పోలీసులు తమని పట్టుకోబోయారని విక్కీ కౌశల్ వెల్లడించారు. కారులో కెమెరా పెట్టి సీక్రెట్ గా షూట్ చేస్తుండగా పోలీసులు చూశారని, దాంతో తామంతా అక్కడినుంచి పారిపోయామని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో విక్కీ తన లేటెస్ట్ సినిమా 'బ్యాడ్ న్యూస్' సంగతులతో పాటుగా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
విక్కీ కౌశల్ 2015లో 'మసాన్' అనే సినిమాతో తొలిసారిగా బిగ్ స్క్రీన్ మీద కనిపించారు. ఆ తర్వాత రామన్ రాఘవ్ 2.0, రాజీ, సంజు, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, సర్దార్ ఉద్దమ్, సామ్ బహదూర్ వంటి సినిమాల్లో నటించారు. ఉరిలో మిలటరీ ఆఫీసర్‌గా అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ నటుడిగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు. విక్కీ నటించిన 'బ్యాడ్ న్యూస్' మూవీ గత శుక్రవారం విడుదలైంది. త్రిప్తి దిమ్రీ, అమీ విర్క్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. విక్కీ ప్రస్తుతం లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఛావా' సినిమాలో ఛత్రపతి శంభాజీ పాత్ర పోషిస్తున్నారు.