AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Andhra News: ఏపీలో ఎన్టీపీసీ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు సిద్ధమైంది.
NTPC Invested 1.87 Lakh Crores In AP: ఏపీలో మరో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు ఎన్టీపీసీ (NTPC) సిద్ధమైంది. ఈ మేరకు రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో గురువారం సచివాలయంలో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం రానుంది. దాదాపు 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు NGEL - NREDCAP మధ్య సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రులు లోకేశ్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్టీపీసీ గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ గురుదీప్ సింగ్, ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.సారంగపాణి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్ కో, జెన్ కో అధికారులు ఉన్నారు.
రాష్ట్రానికి భారీ లబ్ధి
ఈ ఒప్పందంతో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహర్దశ ప్రారంభమైందనే చెప్పాలి. ఇది అమల్లోకి రావడం ద్వారా ఏపీలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ.1,87,000 కోట్ల పెట్టుబడి ఎన్జీఈఎల్ పెట్టనుంది. దీని ద్వారా దాదాపు రాష్ట్రంలో 1,06,250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఈ జాయింట్ వెంచర్ ఇంధన రంగంలో ఏపీని అగ్రగామి చేసే క్రమంలో కీలక అడుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్‌ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తి చెయ్యాలని తెలిపారు. కాలుష్య రహిత ఇంధన వనరుల ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్రానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగా వాట్ల సౌరశక్తి, 35 గిగా వాట్ల పవన శక్తి, 22 గిగా వాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగం విషయంలో ఎంతో నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామన్నారు.
ప్రాజెక్టుల రాకతో ప్రాంతాల అభివృద్ధి
ఎన్జీఈఎల్ – ఎన్‌ఆర్ఈడీసీఏపీ సంయుక్త భాగస్వామ్యంతో 25 గిగా వాట్ల సామర్ధ్యం ఉన్న సౌర, పవన, హైబ్రిడ్ సిస్టమ్‌ల ఇంధన ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి ఉత్పన్నాలను తగిన పద్ధతుల ద్వారా 0.5 MMTPA(మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. అదనంగా, రాష్ట్రంలోని అనువైన ప్రదేశాల్లో 10 గిగా వాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ జాయింట్ వెంచర్‌తో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రావడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల రూపురేఖలు మారతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ