Alia Bhatt: పెళ్లి చీరలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నఆలియా - ఫ్యాన్స్ ఫిదా
ఆలియా భట్.. తన పెళ్లి చీరను చాలా స్పెషల్‌గా చూస్తుందని తాజాగా నేషనల్ అవార్డ్‌లో తనను చూస్తే తెలుస్తోంది.
పెళ్లి చీర అనేది ఎవరికైనా స్పెషల్‌గానే ఉంటుంది. అది సాధారణ మహిళకు అయినా.. సినీ సెలబ్రిటీకు అయినా.. అయితే మామూలుగా పెళ్లికి ఎంత కాస్ట్‌లీ చీర కట్టినా కూడా అది మరోసారి కట్టడానికి మహిళలకు పెద్దగా సందర్భాలు రావు. కానీ ఆలియా భట్ మాత్రం తన అత్యంత ముఖ్యమైన రోజున తన పెళ్లి చీరతో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా రణబీర్ కపూర్‌తో కలిసి తనకు వచ్చిన నేషనల్ అవార్డును అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన ఆలియా.. తన పెళ్లి చీరలో కనువిందు చేసింది. ఇక తనతో పాటు నేషనల్ అవార్డ్ షేర్ చేసుకున్న కృతి సనన్ కూడా దాదాపుగా ఇదే టైప్‌లో చీర కట్టింది. అయితే నేషనల్ అవార్డ్ షేర్ చేసుకుంటున్న వీరు.. చీరలు కూడా షేర్ చేసుకున్నారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
పెళ్లి చీరలో ఆలియా..
ఢిల్లీలో నేషనల్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఉత్తమ నటీమణులుగా ఈసారి నేషనల్ అవార్డ్.. ఒకరిని కాదు ఇద్దరు హీరోయిన్స్‌ను వరించింది. వారే ఆలియా భట్, కృతి సనన్. ఢిల్లీలోని విగ్యాన్ భవాన్‌లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు ఆలియా, కృతి. అయితే ఈ ఈవెంట్ కోసం ఆలియా కట్టుకున్న చీర.. చాలామంది దృష్టిని ఆకర్షించింది. అది తన పెళ్లి చీర అని ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. సభ్యసాచితో స్పెషల్‌గా క్రియేట్ చేసుకున్న తన పెళ్లి చీరను నేషనల్ అవార్డ్ అందుకోవడానికి కట్టుకొని వచ్చిందని ఆలియాను తన ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
ముగ్గురు ఒకే విధమైన చీరల్లో..
2022 ఏప్రిల్ 14న ఆలియా భట్.. తన చిన్ననాటి క్రష్ రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. ఆరోజు మరికొన్ని ఆభరణాలు ధరించిన ఆలియా.. నేషనల్ అవార్డ్ కోసం సింపుల్‌గా ఒక నెక్లెస్ పెట్టుకొని, జడలో పువ్వులతో ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ కోసం ఆలియాతో పాటు రణబీర్ కూడా వెళ్లాడు. వీరిద్దరూ మంగళవారం ఉదయం ముంబాయ్ ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఆలియా భట్‌లాగానే కృతి సనన్ కూడా లైట్ కలర్ చీరను కట్టుకొని, జడలో పువ్వులతో అందంగా ముస్తాబయ్యింది. అంతే కాకుండా ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న వహీదా రెహమాన్ కూడా దాదాపుగా వీరి కలర్ చీరనే కట్టుకున్నారు. దీంతో నేషనల్ అవార్డ్ కోసం వచ్చిన ముగ్గురు మహిళలు ఒకే విధంగా రెడీ అయ్యి ఆకట్టుకున్నారని నెటిజన్లు అనుకుంటున్నారు.
‘గంగూబాయ్’గా ఆలియా, ‘మిమి’గా కృతి..
ఆలియా భట్.. ‘గంగూబాయ్ కతియావాడి’ చిత్రంలో తన నటనకుగానూ నేషనల్ అవార్డ్‌ను అందుకుంది. ఒకప్పుడు కమాఠిపురలాంటి వేశ్యగృహాన్ని నడిపించిన గంగూబాయ్ అనే వేశ్య కథ ఇది. బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గంగూబాయ్ పాత్రలో ఆలియా.. విపరీతంగా ఆకట్టుకోవడంతో తనకు ఎన్నో ప్రశంసలతో పాటు ఇప్పుడు నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇక కృతి సనన్.. ‘మిమి’ చిత్రంలో చూపించిన నటవిశ్వరూపానికి నేషనల్ అవార్డ్ వరించింది. లక్ష్మణ్ ఉతేకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒక తల్లిగా నటించిన కృతి.. తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించింది. దీంతో ఈ ఇద్దరు భామలు.. ‘గంగూబాయ్ కతియావాడి’, ‘మిమి’ చిత్రాల్లో కనబరిచిన నటనకు నేషనల్ అవార్డులు వారి సొంతం అయ్యాయి.
Also Read: ఊర్వశీ రౌతేలా బంపర్ ఆఫర్ - పోయిన తన గోల్డెన్ ఐఫోన్ కనిపెడితే...
Join Us on Telegram: https://t.me/abpdesamofficial