Akshay Kumar: శివభక్తుడిగా అక్షయ్ కుమార్ - స్వయంగా పాడటమే కాదు, శివతాండవంతో అదరగొట్టాడు
Shambhu Song: ‘శంభు’ అనే ఒక ప్రైవేట్ ఆల్బబ్ సాంగ్‌లో మెరిసాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఇందులో తను శివభక్తుడిగా మైమరిచిపోతూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
Akshay Kumar: సీనియర్ హీరో అక్షయ్ కుమార్.. మొదటిసారి ఒక శివభక్తుడి పాత్రలో కనిపిస్తూ.. మైమరిచిపోయి డ్యాన్స్ చేయడంతో పాటు పాటను కూడా పాడాడు. ‘శంభు’ అనే పేరుతో ఒక మ్యూజికల్ వీడియో విడుదలయ్యింది. అందులో అక్షయ్ కుమార్ శివభక్తుడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాటను ‘టైమ్స్ మ్యూజిక్’ తమ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. ఈ పాటకు సుధీన్ యదువంశీ, విక్రమ్ మంత్రోస్‌తో పాటు అక్షయ్ కుమార్ కూడా తన గాత్రాన్ని అందించాడు. ప్రస్తుతం అక్షయ్ ఫ్యాన్స్ అంతా ‘శంభు’ పాటకు ఫిదా అవుతున్నారు.
అదే లుక్..
3 నిమిషాల నిడివి ఉన్న ‘శంభు’ పాటలో అక్షయ్ కుమార్ లుక్.. దాదాపు ‘ఓఎమ్‌జీ 2’ మూవీలోని లుక్ లాగానే ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇందులో అదనంగా ముక్కు పుడకతో కనిపించాడు అక్షయ్. ఇందులో ఈ హీరో డ్యాన్స్ చేస్తుంటూ తన చుట్టూ ఉన్న శివభక్తులు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అభినవ్ శేఖర్.. ఈ పాటకు లిరిక్స్‌ను అందించాడు. ఈ పాట గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు అక్షయ్ కుమార్. శంభు, మీ అందరి ముందుకు వచ్చేసింది అంటూ దీనిని విడుదల చేశాడు. పైగా ఈ పాట తనకు ఎంతో ప్రత్యేకం అని కూడా చెప్పుకొచ్చాడు.
జై శ్రీ మహాకాళ్..
‘‘నా మనసు లోతుల్లో నుండి శంభు వచ్చింది. అక్కడ జై శ్రీ మహాకాళ్ అని మాత్రమే వినిపిస్తుంది. నేను చాలాకాలం నుండి శివభక్తుడిగా ఉన్నాను. కానీ ఈమధ్య కాలంలో ఆయనతో నా అనుబంధం, ఆయనపై నా భక్తి మరింత పెరుగుతూ వచ్చాయి. నాకు ఆయనే శక్తి, ఆయనే ప్రేమ, ఆయన సాయమే మన అందరికీ కావాలి, ఆయనే మనల్ని కాపాడే కవచం, ఆయనకే మనం అందరం లొంగిపోవాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ పాటతో శివుడిపై నాకు ఉన్న అమితమైన ప్రేమలో రవ్వంతైనా బయటికి చూపించగలుగుతున్నానని అనుకుంటున్నాను. జై శ్రీ మహాకాళ్’’ అంటూ శివుడిపై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టాడు అక్షయ్ కుమార్.
థ్రిల్లింగ్‌గా ఉంది..
అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేయడంపై టైమ్స్ మ్యూజిక్ సీఈఓ మందర్ ఠాకూర్ స్పందించారు. ‘‘ఇలాంటి ఒక గొప్ప మ్యూజికల్ వెంచర్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. శంభు అనేది కేవలం ఒక పాట మాత్రమే కాదు.. ఇది ఆడియో, సినిమాటిక్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ యొక్క అద్భుతమైన కలయుక’’ అని మందర్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం విడుదలయిన ‘ఓఎమ్‌జీ 2’ చిత్రంలో అక్షయ్ కుమార్ ఏకంగా శివుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆ మూవీ ఎన్నో కాంట్రవర్సీలను క్రియేట్ చేసినా కూడా చూసిన ప్రేక్షకుల దగ్గర నుండి మాత్రం పాజిటివ్ రివ్యూలనే అందుకుంది. ప్రస్తుతం ‘బడే మియా చోటే మియా’ చిత్రంలో నటిస్తున్నాడు అక్షయ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
Also Read: యశ్ 'టాక్సిక్'లో ఆ బాలీవుడ్ హీరో క్యామియో రోల్ చేస్తున్నాడా?