'ఏజెంట్' ఫ్లాప్ పై తొలిసారి స్పందించిన అఖిల్, కావాలనే సూరీని లైట్ తీసుకున్నాడా?
ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఏజెంట్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది. ఈ నేపథ్యంలో మూడు వారాల తర్వాత మూవీ ఫెయిల్యూర్ పై హీరో అఖిల్ అక్కినేని ట్విట్టర్ వేదికగా తొలిసారి స్పందించారు.
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా తీవ్ర నిరాశ పరిచింది. అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీ ఫెయిల్యూర్ పై ఇప్పటికే నిర్మాత స్పందించగా.. తొలిసారి అఖిల్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా పరాజయాన్ని పరోక్షంగా అంగీకరించిన యువ హీరో.. అభిమానులు, శ్రేయోభిలాషులను ఉద్దేశిస్తూ ఓపెన్ లెటర్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పాడు.
"ఏజెంట్ సినిమాకి ప్రాణం పోయడం కోసం తమ జీవితాలను అంకితం చేసిన నటీనటులు మరియు సిబ్బందికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మా స్థాయిలో అత్యుత్తమంగా ప్రయత్నించినప్పటికీ, దురదృష్టవశాత్తూ మేము అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించలేకపోయాం. నాకు పెద్ద సపోర్ట్ గా నిలిచిన నిర్మాత అనిల్ గారికి స్పెషల్ గా థాంక్స్ చెబుతున్నాను. మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లందరికీ, మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ కారణంగానే నేను కష్టపడి పని చేస్తున్నాను. అందుకు మీ అందరికీ థ్యాంక్స్. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం నేను స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తాను" అని అఖిల్ తన నోట్ లో పేర్కొన్నారు.
— Akhil Akkineni (@AkhilAkkineni8) May 15, 2023
అయితే అఖిల్ తన లెటర్ లో ఎక్కడా కూడా దర్శకుడు సురేందర్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనపై భారీ బడ్జెట్ ఖర్చు చేసిన నిర్మాతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. కానీ, దర్శకుడిని మాట వరసకు కూడా మెన్షన్ చేయలేదు. దీంతో అఖిల్ కావాలనే సూరిని మిస్ చేశాడా? అనే ప్రశ్న తలత్తుతోంది. కానీ నటీనటులు, సాంకేతిక వర్గం అన్నాడు కాబట్టి, డైరెక్టర్ కు కూడా థ్యాంక్స్ చెప్పినట్లే అని అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్న AKHIL6 తో అక్కినేని వారసుడు సత్తా చాటుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా 'ఏజెంట్' సినిమా కోసం అఖిల్ తీవ్రంగా కష్టపడ్డాడు. ఎన్నో నెలల పాటు హార్డ్ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు. అయితే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంపై కొన్నిరోజుల క్రితం నిర్మాత అనీల్ సుంకర వివరణ ఇచ్చారు. 'ఏజెంట్' ఫలితం విషయంలో పూర్తి బాధ్యత తమదే అని, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లి తప్పు చేశామని, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నామని ట్వీట్ లో పేర్కొన్నాడు.
కాగా, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన "ఏజెంట్" సినిమాకు వక్కంతం వంశీ కథ అందించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. హిప్ హాప్ తమిజ సంగీతం సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో మే 17న స్ట్రీమింగ్ కాబోతోంది.