Actress Indraja: ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
CM Pellam Movie: 'ఒకే ఒక్కడు' సినిమాలో సామాన్యుడు సీఎం అయితే అనేది చూపించారు. సీఎం పెళ్ళాం సమాజంలోకి వస్తే ఏం జరుగుతుంది? అనే కథతో ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కింది.
![Actress Indraja: ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే... Actress Indraja latest movie CM Pellam teaser storyline cast and crew revealed Actress Indraja: ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/17/61e4d07048f27e861626f56a06a7b0081726539496017313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాజకీయ నేపథ్యంలో సినిమాలపై ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది. అయితే... పలు సినిమాల్లో రాజకీయ నేతలను విలన్స్ చేశారు. రాజకీయాల్లోకి సామాన్యులు రావడం కష్టం అన్నట్లు చూపించారు. కానీ, దర్శకుడు శంకర్ 'ఒకే ఒక్కడు'లో సామాన్యుడు సీఎం అయితే ఏం జరుగుతుందనేది చూపించి విజయం అందుకున్నారు. గడ్డం వెంకట రమణా రెడ్డి తీసిన కొత్త సినిమాలో సీఎం పెళ్లాం సమాజంలోకి వస్తే ఏం జరుగుతుందనేది చూపిస్తున్నారు.
'సీఎం పెళ్లాం'గా నటి ఇంద్రజ
సీనియర్ కథానాయిక, నటి ఇంద్రజ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా 'సీఎం పెళ్లాం' (CM Pellam Movie). సహజనటి జయసుధ, సుమన్, అజయ్ ఇతర ప్రధాన తారాగణం. ఆర్కే సినిమాస్ పతాకంపై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గడ్డం వెంకట రమణా రెడ్డి దర్శకుడు. తాజాగా టీజర్ విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో సాగే చక్కటి సందేశాత్మక చిత్రం 'సీఎం పెళ్లాం' అని చిత్ర దర్శకుడు తెలిపారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఆలోచింపజేసేలా కథ, కథనాలు ఉంటాయని, సమాజానికి మంచి చేసేందుకు సీఎం పెళ్లాం ముందుకు వస్తే ఎలా ఉంటుందనేది చూపించామని ఆయన చెప్పారు. మహిళా సాధికారత గురించి సినిమాలో ప్రస్తావించామని నిర్మాత బొల్లా రామకృష్ణ తెలిపారు.
సందేశంతో కూడిన చక్కటి సినిమా - ఇంద్రజ
సినిమాలో తనది టైటిల్ రోల్ అని, 'సీఎం పెళ్లాం'గా నటించానని ఇంద్రజ (Actress Indraja) తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... ''నాకు ఇదొక స్పెషల్ సినిమా. ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇస్తుంది. సుమన్ గారితో హీరోయిన్‌గా నటించా. ఆయన స్టార్ హీరో అయినా ఎంతో కలివిడిగా ఉండేవారు. అప్పటికీ, ఇప్పటికీ ఆయన మంచి మనసు ఒకేలా ఉంది. అజయ్, జయసుధ గారితో చేయడం సంతోషంగా ఉంది'' అని అన్నారు.
ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ రోల్ చేశానని, అది రొటీన్‌కు భిన్నమైన క్యారెక్టర్ అని సుమన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''దర్శకుడు వెంకట రమణా రెడ్డి బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ముందుగా రెడీ అయ్యి చక్కగా సినిమా చేశారు. అజయ్ మంచి నటుడు, ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలి. నేను, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా సినిమా చేశాం. ఇప్పుడు ఆమెతో నటించడం సంతోషంగా ఉంది. రాజకీయ, బ్యూరోక్రాట్ వ్యవస్థలను ప్రశ్నిస్తూ సాగే మంచి చిత్రమిది. ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. ఈ సినిమాలో హోం మంత్రి పాత్ర చేశానని సురేష్ కొండేటి చెప్పారు.
Also Read: 'ధూమ్ 4'లో సూర్య... బాలీవుడ్ సినిమాలో విలన్‌గా రోలెక్స్‌కు ఛాన్స్?
నటుడు అలీ మాట్లాడుతూ... ''దర్శకత్వం మీద ప్రేమతో గడ్డం వెంకట రమణా రెడ్డి చిత్రసీమకు వచ్చారు. ఇరవై సంవత్సరాల క్రితం ప్రకాష్ రాజ్ గారితో సినిమా చేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి బాగా స్థిరపడ్డాడు. సినిమా మీద ప్రేమతో మళ్లీ ఇండియా వచ్చాడు. మంచి సినిమా 'సీఎం పెళ్లాం' తీశాడు'' అని అన్నారు. నటుడు అజయ్, నటి స్వాతి, నటుడు 'ఘర్షణ' శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
CM Pellam Telugu Movie Cast And Crew: జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్, ఘర్షణ శ్రీనివాస్, మురళీధర్, ప్రీతి నిగమ్, రూప లక్ష్మి, స్వాతి, తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: ఆర్కే సినిమాస్, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, సహ నిర్మాత: బొల్లా వెంకటేశ్వరరావు, నిర్మాత: బొల్లా రామకృష్ణ, రచన - దర్శకత్వం: గడ్డం వెంకట రమణా రెడ్డి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)