(Source: ECI/ABP News/ABP Majha)
Vishal: రియల్ లైఫ్‌లోనైనా, రీల్ లైఫ్‌లోనైనా వేరొకరి బిడ్డను అనాథగా విడిచిపెట్టలేను - హీరో విశాల్
Detective 2: హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డిటెక్టివ్ 2’. తాజాగా 'ఎక్స్' వేదికగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ అందించారు.
Vishal: తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరోలలో విశాల్ ఒకరు. ఆయన నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తూ టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. గతేడాది 'మార్క్ ఆంటోనీ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ యాక్షన్ హీరో.. ప్రస్తుతం ‘రత్నం’ అనే మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీంతో పాటుగా ‘డిటెక్టివ్ 2’ చిత్రంలో నటిస్తున్నారు విశాల్. ఈ సినిమాతో ఆయన మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ అవతారమెత్తుతున్నాడు. ఈ నేపథ్యంలో 'ఎక్స్' వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విశాల్ ఓ పోస్ట్ పెట్టారు.
''చివరకు 25 ఏళ్ల తర్వాత నా ప్రయాణం ప్రారంభమైంది. నా కల, నా ఆకాంక్ష, జీవితంలో నేను ఎలా ఉండాలని మొదట్లో ఆలోచించానో అది ఎట్టకేలకు నిజం కాబోతోంది. అవును, నేను ఇప్పుడు కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నాను. అది ఒక డెబ్యూ డైరెక్టర్ బాధ్యత. నా కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకున్నది. నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం 'తుప్పరివాలన్ 2' & 'డిటెక్టివ్ 2' కోసం లండన్ బయలుదేరాం. అక్కడ అజర్‌బైజాన్, మాల్టాలలో షూటింగ్ చేయబోతున్నాం. దీన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు'' అని విశాల్ ట్వీట్ చేశారు.
''హార్డ్ వర్క్ ఎప్పుడూ వృథా కాదు అని మా నాన్న జి.కె. రెడ్డి, యాక్షన్ కింగ్ అర్జున్ సార్ చెప్పిన మాటలను నేను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటాను. ఏది ఏమైనా కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం మానొద్దు. ఎందుకంటేఏదో ఒక రోజు అది నిజమవుతుంది. నటుడిగా నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దర్శకుడిగానూ నాకు మీ సపోర్ట్ కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన డైరెక్టర్ మిస్కిన్ సర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చింతించకండి, రియల్ లైఫ్‌లోనైనా లేదా రీల్ లైఫ్‌లోనైనా వేరొకరి బిడ్డను నేను అనాథగా విడిచిపెట్టను.. గమ్య స్థానం చేరేలా చేస్తాను సార్. గాడ్ బ్లెస్. ఇప్పుడు పని మొదలుపెడతాను’’ అని విశాల్ తన పోస్టులో పేర్కొన్నారు.
And my journey begins finally after 25 years. My dream, my aspiration, my first thought of wat I wanna be in life has come true. Yes, I take charge of a new responsibility, the most challenging in my career,that of a debutante director. Here we go finally. Off to London,… pic.twitter.com/aiLVQZ3Bbx
— Vishal (@VishalKOfficial) March 16, 2024
2017లో విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'తుప్పరివాలన్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'డిటెక్టివ్' పేరుతో రిలీజ్ చేసారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, ప్రసన్న, ఆండ్రియా, వినయ్ రాయ్, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకి కొనసాగింపుగా ‘డిటెక్టివ్ 2’ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ఈ సీక్వెల్ మిస్కిన్ దర్శకత్వంలోనే రూపొందాల్సి ఉంది. అయితే బడ్జెట్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాల కారణంగా మిస్కిన్‌ను తొలగించి, విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.
'డిటెక్టివ్ 2' ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ, దర్శకుడిగా మిస్కిన్‌ను తొలగించడానికి గల కారణాలను లేఖ రూపంలో వివరించాడు విశాల్. ఒకరి ప్రతిష్టకు భంగం కలిగించాలనేది తన ఉద్దేశ్యం కాదని, నిర్మాతల కష్టాలు కొత్తగా వచ్చే నిర్మాతలు తెలుసుకుంటారని చెబుతున్నానని పేర్కొన్నాడు. సినిమాని మధ్యలో వదిలేయలేక తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 'తుప్పరివాలన్ 2' నుంచి తనను తప్పించడంపై మిస్కిన్ కూడా విశాల్ పై కౌంటర్లు వేశాడు. తాను సినిమాలోని ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 400 కోట్లు అడిగానని సెటైరికల్ కామెంట్స్ చేశాడు. నిజ జీవితంలో లేదా రీల్ జీవితంలో నేను వేరొకరి బిడ్డను అనాథగా వదిలేయను అని మిస్కిన్ ని ఉద్దేశిస్తూ విశాల్ తాజాగా పోస్ట్ పెట్టారు. డైరెక్టర్ కావాలనే తన డ్రీమ్‌ని ఇంత త్వరగా నిజం అయ్యేలా చేస్తున్నందుకు మిస్కిన్ కి థ్యాంక్స్ చెప్పారు.
Also Read: 'కీడా కోలా' వివాదం - ఎస్పీ చరణ్ లీగల్ నోటీసులపై తొలిసారిగా స్పందించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్