SivaKarthikeyan: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టిన శివ కార్తికేయన్... ఆ రోజు ఏమైందో చెప్పిన 'అమరన్' స్టార్
చిన్నప్పటి నుంచి హీరోగా భావించిన తన తండ్రి చనిపోయాడని తెలిసి గుండె బద్దలైందని నటుడు శివ కార్తికేయన్ వెల్లడించారు. 17 ఏండ్ల వయసు నుంచి ఆయన జ్ఞాపకాల్లో గడుపుతున్నట్లు గుర్తు చేసుకున్నారు.
Siva Karthikeyan About His Father Death: తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం ‘అమరన్’ మంచి విజయాన్ని అందుకుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో... శివ కార్తికేయన్ ముకుంద్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి నటించారు. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆయన తన తండ్రి జి దాస్ ను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి తాను హీరోగా భావించిన తన తండ్రి చనిపోవడాన్ని చూసి గుండె పగిలిందన్నారు. ఆ తర్వాత తను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.
21 ఏండ్లుగా ఆయన జ్ఞాపకాల్లో జీవిస్తున్నా- శివ కార్తికేయన్
“మా నాన్న నిజాయతీ గల పోలీస్ అధికారి. జైలు సూపరెండెంట్ గా పని చేశారు. పోలీసు శాఖలో అందరూ అతడిని ఎంతో గౌరవంగా చూసేశారు. నేను ఈ సినిమా చేయడానికి అసలు కారణం ఆయనే. గత 21 సంవత్సరాలుగా నేను ఆయన జ్ఞాపకాల్లో జీవిస్తున్నాను. ‘అమరన్’ సినిమాలో నేను మా నాన్నను చూసుకున్నాను. ఆయన నా దృష్టిలో మా నాన్న పెద్ద హీరో. చిన్నప్పుడు నేను ఆయన షూ పాలిష్ చేసేవాడిని. బ్యాడ్జీని రెడీ చేసే వాడిని. ‘అమరన్’ సినిమాలో అచ్చం ఆయన లాగే నటించాను. దివంగత మేజర్ ముకుంద్ కు, మా నాన్నకు మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. మరో 2 రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పిన ఆయన.. అంబులెన్స్ లో ఐస్ బాక్స్ లో ఇంటికి చేరుకున్నారు. అంత్యక్రియలు అయిపోయాక కేవలం ఆయన ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటిని చూసి నా గుండె ముక్కలైంది. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ముకుంద్ పాత్రలో నటించడం వల్ల ఇద్దరు వ్యక్తులకు న్యాయం చేసినట్లు భావిస్తున్నాను” అంటూ శివ కార్తికేయన్ ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘అమరన్’
‘అమరన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు సాధించింది. ఇండియాలో ఇండియాలో రూ.100 కోట్ల మార్కును దాటించింది.
‘అమరన్’పై ప్రముఖుల ప్రశంసలు
‘అమర్’ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ మూవీని నిర్మించిన కమల్ హాసన్ కు ఫోన్ చేసి అభినందించారు. అద్భుతమైన సినిమాను ప్రొడ్యూస్ చేశారంటూ ప్రశంసలు కురిపించారు. హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు రాజ్ కుమార్ తో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు.
Read Also: రష్మీని ఆడుకున్న బుల్లెట్ భాస్కర్... శివాజీ పెద్ద ఆటగాడు అంటోన్న నూకరాజు