Actor Siddharth: 2000 మందితో 'గేమ్ ఛేంజర్', అది పూర్తిచేసుకుని ‘భారతీయుడు’లో 1000 మందితో షూట్ - సిద్ధార్థ్
'భారతీయుడు - 2' సినిమా ట్రైలర్ లాంచ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సిదార్థ్ మాట్లాడుతూ కమల్ హాసన్, శంకర్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు. 'గేమ్ ఛేంజర్' గురించి హింట్ ఇచ్చారు.
Actor Siddharth About Game Canger Movie: కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'భారతీయుడు - 2'. ఈ సినిమా కోసం అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సిదార్థ కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. వాళ్ల గురించి మాట్లాడుతూనే 'గేమ్ ఛేంజర్' సినిమా గురించి కూడా హింట్ ఇచ్చారు. 2000 మందితో 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎట్టకేలకు ఇలాగైనా షూట్ గురించి హింట్ ఇచ్చారు అంటూ మాట్లాడుకుంటున్నారు.
నేను వాళ్ల నుంచి నేర్చుకుంది అదే..
"నేను ఈ విషయంలో నా ఇద్దరి గురువుల గురించి మాట్లాడాలి. శంకర్ సార్ చేసిన ప్రతి సినిమా మాములు మాటలు కాదు. ఆయన తీసిన ప్రతి సినిమా అద్భుతమే. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతీది చాలా బాగుంటుంది. ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు సినిమా గురించి ఆలోచిస్తారు. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఆయన కలలో కూడా దాని గురించే ఆలోచిస్తాడు. ఆయన్ని నేను 21 ఏళ్లుగా చూస్తున్నాను. అందుకే, ఆయన్ని నేను మర్చంట్ ఆఫ్ డ్రీమ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఎందుకంటే? ఆయన ఆలోచన, ఆయన కనే కల మనకు నిద్రలేని రాత్రుల ఇస్తాయి. ‘నేను ఒక దాదా’ సాంగ్ తీస్తున్నప్పుడు ఆ సెటప్ చూసి నేను కలలో ఉన్నానా? నిజంగానే డ్యాన్స్ చేస్తున్నానా? అని అనిపిస్తుంది నాకు. సెటప్, ఆ షార్ట్, వెయ్యి మంది మధ్యలో నేను ఎలా చేయిస్తారు? అదీ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అంతేకాదు.. ముందు రోజు ఆయన మరో 2000 మందితో వేరే భాషలో సినిమా తీస్తున్నారు. అసలు అది ఎలా సాధ్యం? మళ్లీ పొద్దున్నే 4.30 గంటలకు వచ్చి ఇక్కడ వెయ్యి మందితో షూట్ చేస్తున్నాడు. అదే చెప్తుంది ఆయన సినిమా గురించి ఎంతలా ఆలోచిస్తారు అని".
కమల్ సార్ నిత్య విద్యార్థి..
"ఇక కమల్ సార్ విషయానికొస్తే.. ఆయన గురించి నేను 20 ఏళ్ల కిందటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. దాన్నే ఇక్కడ మళ్లీ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తారు. ముందు యాక్టర్ గా మనల్ని మనం నిరూపించుకోవాలి. స్టార్ అవ్వాలా, హీరో అవ్వాలా అనేది మన వర్క్ చెప్తుంది అనేవాళ్లు. డైరెక్టర్ ఆ విషయం చూసుకుంటారు అనేవాళ్లు. అవన్నీ కరెక్ట్ గా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా చప్పట్లు కొడతారు. ఇక ఆయనతో వర్క్ చేయడం అంటారా.. చాలా ఎగ్జైటింగ్ అనిపించేది నాకు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆయన ప్రతి షాట్ లో ఇదే నా మొదటి షాట్ అన్నట్లు చేసేవాళ్లు. అలానే చేస్తారు. ఆయన డైరెక్టర్స్ దగ్గర కూడా చాలా వినయంగా ఉంటారు. ఇక ప్రతి రోజు ఆయన ఏదో ఒకటి చదువుతుంటారు. సినిమాలు చూసి దాంట్లో నుంచి చాలా నేర్చుకుంటారు. "నాకు కూడా ఫోన్ చేసి ఈ బుక్ చదివావా నువ్వు ? " బాగుంటుంది చదువు అని చెప్తుంటారు. అలా ఆయన ప్రతి రోజు నిత్య విద్యార్థి" అని కమల్ హాసన్ గురించి చెప్పారు సిదార్థ.
దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'భారతీయుడు - 2'. పాన్ ఇండియాలో లెవెల్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు సినిమా బృందం. ట్రైలర్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. 1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కమల్ హాసన్, కాజల్, సిదార్థ, రకుల్ ప్రీత్ సింగ్ తదితరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత శంకర్ 'గేమ్ ఛేంజర్' సినిమాని పరుగులు పెట్టిస్తాడనే వార్తలు వస్తున్నాయి. 'భారతీయుడు - 2' సినిమా త్వరితగతిన పూర్తి చేసేందుకు 'గేమ్ ఛేంజర్' సినిమా షూట్ లేట్ అయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి.