Actor Sharanya: సమంత గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు, ప్రియమణి నాతో అలా ఉంటుంది: నటి శరణ్య
Actor Sharanya:‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఇటీవల రిలీజైన సినిమాల్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో శరణ్య యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి.
Actor Sharanya About Cinema Career: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఈ మధ్య కాలంలో రిలీజైన సినిమాల్లో ఇది మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలో నటించిన యాక్టర్ శరణ్యకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె నటించిన సినిమా ‘భామాకలాపం - 2’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు విశేషాలను పంచుకుంది.
మర్చిపోలేని గిఫ్ట్..
'ఫిదా'తో సినీ ఇండస్ట్రీకి వచ్చిన న్యూస్ రీడర్ శరణ్య. చాలా తక్కువ టైంలో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనదైన నటనతో ప్రశంసలు పొందారు ఆమె. దాంట్లో భాగంగానే విజయ దేవరకొండ నటించిన 'ఖుషి' సినిమాలో సమంత ఫ్రెండ్ గా నటించారు. ఇక ఆ టైంలో జరిగిన కొన్ని మెమొరీస్ పంచుకున్నారు శరణ్య. "సమంత చాలా కూల్. తక్కువ మాట్లాడతారు. కానీ, చాలా బాగా మాట్లాడతారు. నిజానికి నేను వాళ్లను డిస్ట్రబ్ చేయను. ఇక విజయ్ దేవరకొండ కూడా అంతే.. నాకై నేను మాట్లాడితే చాలా చాలా బాగా మాట్లాడతారు. కానీ, డిస్ట్రబ్ చేయడం ఎందుకు? అన్నట్లు ఊరుకుంటాను. ఇక సమంత నాకు జీవితంలో మర్చిపోలేని కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చారు. ‘ఖుషి’ టైంలో నా బర్త్ డే కాశ్మీర్ లో సెలబ్రేట్ చేశారు. అప్పుడు ఆమె రెండు కాస్ట్ లీ షాల్స్, ఇంకా మంచి బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అది నాకు చాలా స్పెషల్" అని అన్నారు శరణ్య.
ప్రియమణి అక్క లాంటిది..
"ఇక 'భామాకలాపం -2' గురించి చెప్పాలంటే.. ఈసారి ఇది డబుల్ ఫన్. భామాకలాపంతో పోలిస్తే ఈ సినిమా అన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఫన్, మర్డర్స్ అన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ప్రియమణి గారు నాతో అక్క లాగా ఉంటారు. సెట్స్ లో ఇద్దరం అక్కాచెల్లెళ్ల లాగా చాలా ఫన్నీగా ఉంటాం. గాసిప్స్ చెప్పుకుంటాం. ఫన్నీ టాస్క్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తాం" అని ప్రియమణి గురించి చెప్పారు.
యాస కోసం బాగా వర్కౌట్ చేశా...
"సినిమా షూట్ మొదలయ్యే ముందు వర్క్ షాప్స్ ఉంటాయి. దాంట్లో మన క్యారెక్టర్. సీన్స్ చెప్తారు. దాన్నిబట్టి ఎమోషన్స్, ఫీలింగ్స్ లాంటివి చూసుకుంటాం. ఇక అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి చాలా కష్టపడ్డాను. తెలంగాణ యాస బాగా వస్తుంది నాకు. కానీ, అందులో గోదావరి యాస రావాలి. ఎవరైనా తెలంగాణ యాస నేర్చుకుని మాట్లాడితే.. నేను గుర్తుపట్టేస్తా. అలా నన్ను ఎవ్వరూ అనొద్దు అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకున్నా. అలా ప్రతి క్యారెక్టర్ కి 100 శాతం ఇవ్వాలి అనుకుంటాను" అని 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' గురించి చెప్పారు శరణ్య.
సాయిపల్లవి నిజంగానే ఏడ్చేసింది..
"ఫిదా సినిమా తీసేటప్పుడు.. ఒక సీన్ లో సాయి పల్లవి నిజంగానే ఏడ్చేసింది. మనమే ఎందుకు వెళ్లాలి? అక్క, బావనే ఇక్కడికి రమ్మనొచ్చు కదా? అని అడిగే సీన్‌లో ఇద్దరం ఏడవాలి. సాయిపల్లవి న్యాచురల్‌గా ఏడ్చేశారు. నేను అలా చూస్తూ ఉండిపోయాను. అప్పుడు అసలు నా ఫీలింగ్ నాకు అర్థం కాలేదు. నేను ఏడవలేకపోయానా? ఆమెలా నటించడం లేదా అని అనుకున్నాను. సీనియర్స్ తో చేసేటప్పుడు ఒక్కోసారి అలా అనిపిస్తుంది" అంటూ 'ఫిదా' నుంచి ఇప్పటివరకు ఆమె సినీ కెరీర్ గురించి పంచుకున్నారు శరణ్య.
Also Read: ‘భ్రమయుగం’లో విలన్ లేడు, హీరో లేడు - ఆసక్తికర విషయాలు చెప్పిన మెగాస్టార్