Mohan Babu: పాపం, ఘోరం, నికృష్టం... భక్తుడిగా తల్లడిల్లిపోయా - తిరుపతి లడ్డూ వివాదంపై మోహన్ బాబు ట్వీట్
Tirupati Laddu Controversy: యావత్ దేశాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందర్నీ ఉలిక్కిపాటుకు గురి చేసింది తిరుపతి లడ్డూ వివాదం. దీనిపై లెజెండరీ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.
లెజెండరీ నటుడు, 'పద్మశ్రీ' పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) ఎటువంటి అరమరికలు లేని మనిషి. ముక్కుసూటిగా వ్యవహరించడం, తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయనకు అలవాటు. ఇప్పుడు యావత్ భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన తిరుమల తిరుపతి ఏడు కొండల వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం మీద సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏం చెప్పారంటే...
భక్తుడిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన లేఖను మోహన్ బాబు ప్రారంభించారు. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో మూడు నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వును కలుపుతున్నారనే విషయం తెలియగానే ఒక భక్తుడిగా తాను తల్లడిల్లిపోయానని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబూ... నిజమైతే దోషులను శిక్షించు
తమ మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ప్రతి రోజూ భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని మోహన్ బాబు తెలిపారు. ఆ స్వామి దగ్గర ఈ విధంగా జరగడం (లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం) ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం అని ఆయన అన్నారు.
Also Read: ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు... లడ్డూ వివాదంలో సెటైరికల్ ట్విట్టర్ యుద్ధం
విజ్ఞప్తి pic.twitter.com/7l8UT9Fbs5
— Mohan Babu M (@themohanbabu) September 21, 2024
లడ్డూలలో జంతువుల కొవ్వు కలపడం నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ని హృదయ పూర్వకంగా కోరారు మోహన్ బాబు. తన మిత్రుడు, ఆత్మీయుడు చంద్రబాబు ఆ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన లేఖను ముగించారు.
Also Read: చంద్రబాబుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ థాంక్స్... నాగవంశీలా తప్పు చేయలేదు!
జగన్ బంధువు అయినా సరే స్పందించిన మోహన్ బాబు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల తిరుపతి లడ్డులలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వంటివి కలిశాయని ఏపీ సీఎం చంద్రబాబు సహా తెలుగు దేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. ల్యాబ్ నివేదికలు సైతం సమర్పించింది.
వైసీపీ అధినేత, ప్రస్తుత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉంది. మోహన్ బాబు పెద్ద కోడలు, విష్ణు సతీమణి వెరోనికా రెడ్డికి జగన్ అన్నయ్య వరుస. అయినా సరే ఈ వివాదం మీద ఆయన స్పందించారు. మరి, ఈ లేఖ మీద వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎవరిపై ఎటువంటి విమర్శలు చేయకుండా ఆయన లేఖ విడుదల చేశారు. నిజమైతే శిక్షించాలని కోరారు.