నాని ‘పాన్ ఇండియా స్టార్’ కామెంట్స్ పై స్పందించిన దుల్కర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన 'కింగ్ ఆఫ్ కోత' మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'కింగ్ ఆఫ్ కోత' ఆగస్టు 24న పాన్ ఇండియా లెవెల్ లో మలయాళం తోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ టీం భారీగా చేస్తున్నారు. ఈ మేరకు అన్ని భాషల్లో ప్రమోషన్స్ నిర్వహించి వరుస ఇంటర్వ్యూల్లో దుల్కర్ సల్మాన్ పాల్గొంటున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా మీడియాతో ఇంట్రాక్ట్ అయిన దుల్కర్ సల్మాన్ ని ఓ రిపోర్టర్ పాన్ ఇండియా ట్యాగ్ గురించి ప్రశ్న అడిగారు. దానికి దుల్కర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.' మీరు ఈ సినిమాని నాలుగు లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నారు. నాచురల్ స్టార్ నాని మీ గురించి దుల్కర్ కమిటెడ్ అండ్ టాలెంటెడ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ అంటూ గొప్పగా చెప్పారు? దీని గురించి మీరేమంటారు?' అని రిపోర్టర్ అడగగా, దానికి దుల్కర్ బదులిస్తూ.. "నాని అలా చెప్పడం సంతోషంగా ఉంది. నాలా అన్ని భాషల్లో సినిమాలు చేసే యాక్టర్స్ కానీ, అన్ని భాషలు మాట్లాడే యాక్టర్స్ చాలామంది ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను అన్ని భాషల్లో సినిమాలు చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తానని" అన్నారు.
"నాకు అన్ని భాషలతో పాటు మన దేశంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలపై ఎంతో అభిమానం ఉంది. ప్రతిసారి నేను వేరే ఇండస్ట్రీలోకి సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడి వాళ్ళలాగే ఉండాలని అనుకుంటాను.సాధారణంగా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఒక టూరిస్ట్ గా ఓ ప్రాంతాన్ని చూడాలని అనుకున్నప్పుడు, ఆ ప్రాంతం గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో మీకు ఒక ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా అన్నీ తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సినిమాల్లో కూడా కావాలని నేను కోరుకుంటా. కాబట్టి అన్ని భాషల్లో వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇతర భాషల్లో నేనెప్పుడూ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ నే" అంటూ పేర్కొన్నారు.
"రీసెంట్ గా నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' సిరీస్ ని కూడా ఇంగ్లీష్ తో పాటు ఐదు లాంగ్వేజెస్ లో డబ్ చేశాం. అలాగే 'కింగ్ ఆఫ్ కోథా' 4 లాంగ్వేజ్ లో డబ్ అయ్యింది. ఇతర భాషల్లో సినిమాలు చేసినప్పుడు ఒక్కో భాష చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఒక్కో భాషలో సేమ్ డైలాగ్స్ ని డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది. అలా అన్ని భాషల్లో ఎక్స్పీరియన్స్ కావాలంటే కచ్చితంగా సినిమా చేయాలి. అందుకే అన్ని భాషల్లో సినిమాలు చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్. దీంతో దుల్కర్ సల్మాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 'కింగ్ ఆఫ్ కోత' సినిమా విషయానికి వస్తే.. అభిలాష్ జోషి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు. జి స్టూడియో సంస్థతో కలిసి తన సొంత ప్రొడక్షన్ హౌస్ వేపేరియర్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు.
Also Read : రిమేక్ సినిమాలపై దుల్కర్ సల్మాన్ రియాక్షన్ - మిగతా హీరోలు ఇలా ఆలోచిస్తారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial