Shakila: షూటింగ్‌కు పిలిచి బట్టలు విప్పేయమన్నారు - ఏడిపించేసిన షకీలా, ‘బిగ్ బాస్’లోకి ఎంట్రి
ఒకానొక సమయంలో షకీలా సినిమాలు బ్యాన్ చేయాలని పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఆ కాంట్రవర్సీ వల్ల నిజంగానే షకీలా సినిమాలు బ్యాన్ అయిపోయాయి కూడా.
ఒకప్పుడు బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హీరోయిన్ షకీలా. అలాంటి హీరోయిన్ చాలాకాలంగా స్క్రీన్‌పై కనిపించడం మానేసింది. అసలు తను ఏమైందో, ఎక్కడ ఉందో కూడా తెలియదు. అలాంటి షకీలా సడెన్‌గా ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి ఎంటర్ అవుతుంది అనగానే.. చాలామంది తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. తన సినిమాలను చూసి ఇప్పటికీ తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుకునే ప్రేక్షకులు అందరికీ తనెంటో నిరూపించుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో 6వ కంటెస్టెంట్‌గా షకీలా ఎంటర్ అయ్యింది. ముందుగా తన గురించి తాను చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 7లో ఆరవ కంటెస్టెంట్‌గా షకీలా పరిచయం చేస్తూ ప్రేక్షకులకు ఒక ఏవీని చూపించారు నాగార్జున. అందులో తన పూర్తి పేరు సీ. షకీలా అంటూ చెప్పుకొచ్చింది. ‘‘అమ్మది నెల్లూరు, నాన్నది చెన్నై. పదో తరగతి ఫెయిల్ అయినప్పుడు బాల్కనీలో నాన్న చాలా కొట్టారు. అప్పుడు పక్కింట్లో ఉండే ఒక మేకప్ మ్యాన్ చూసి సినిమాల్లో చేయించొచ్చు కదా అని సలహా ఇచ్చారు. నాన్న కూడా మీ ఇష్టం అని ఉండేసరికి తరువాతి రోజు షూటింగ్‌కు వెళ్లాను. వెళ్లిన మొదటిరోజే సిల్క్ స్మితకు సిస్టర్ క్యారెక్టర్ చేసే అవకాశం లభించింది’’ అంటూ సినిమాల్లో తనకు వచ్చిన మొదటి అవకాశం గురించి చెప్పింది షకీలా.
సినిమాలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాన్ని అందిస్తాయి. అలాగే తనకు కూడా సినిమాలు ఇచ్చిన చేదు అనుభవాల గురించి షకీలా బయటపెట్టింది. ‘‘సినిమా షూటింగ్ అని పిలిచి బట్టలు విప్పమనేవారు. నాన్నకు చెప్తే చేయొద్దు అనేశారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన మొదటి మలయాళ సినిమా ఆఫర్‌లో బోల్డ్‌గా ఉండాలని తెలిసే చేశాను. నా కుటుంబం అంతా బంగారు గుడ్డుపెట్టే బాతులా చూసింది. ఇంట్లో మొత్తం మూటలు మూటలుగా డబ్బులు ఉండేవి. ఆ విషయం కూడా నాకు తెలియదు. డబ్బులు నేనెప్పుడూ వృథా చేయలేదు. అంతా మా అక్కే తీసుకుంది. ఇప్పుడు తను బాగుంది’’ అంటూ తన సొంత కుటుంబమే తనపై జరిపిన కుట్ర గురించి బయటపెట్టింది షకీలా.
ఒకానొక సమయంలో షకీలా సినిమాలు బ్యాన్ చేయాలని పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఆ కాంట్రవర్సీ వల్ల నిజంగానే షకీలా సినిమాలు బ్యాన్ అయిపోయాయి కూడా. ప్రతీ శుక్రవారం తనది ఒక సినిమా విడుదల అవుతూ ఉండడంతో, మిగతావారి సినిమాలకు ప్రేక్షకులు వెళ్లేవారు కాదని, అందుకే కొందరు కావాలని ఇదంతా చేశారని షకీలా చెప్పింది. అందుకే తానే స్వయంగా నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపింది. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్న తనకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని చెప్తూ బాధపడింది. అలాంటి సమయంలో దర్శకుడు తేజ మాత్రమే తనకు సపోర్ట్‌గా మాట్లాడారని గుర్తుచేసుకుంది.
స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత ఒకప్పుడు తను షకీలా అని, ఇప్పుడు షకీ అమ్మ అని చెప్పింది. హౌజ్‌లోకి వెళ్లే ముందు షకీలాకు కావాల్సిన షాషా, తంగమ్ అనే ఇద్దరు వ్యక్తులను నాగ్ స్టేజ్‌పైకి పిలిచారు. షకీలా తమరిని బిడ్డలాగా చూసుకుంటుందని తెలిపారు. దానికి షకీలా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. ట్రాన్స్‌జెండర్స్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆలోచన ఎన్నో ఏళ్ల నుండి ఉందని, ప్రస్తుతం తన దగ్గర 50 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారని బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుండో వస్తారని తెలిపింది. షకీలా చేసిన ఈ పనికి నాగార్జున చాలా గర్వపడుతున్నట్టు తెలిపారు.