Tasty Teja: టేస్టీ తేజా ఊహించిందే జరిగిందా? ఇక శోభా కెప్టెన్సీని బయట నుంచి చూడాల్సిందేనా?
Shobha Shetty: బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం కూడా శోభశెట్టికి గండం తప్పేలా లేదు. అయితే, ఆమె ఫ్రెండ్ టేస్టీ తేజా ఎలిమినేట్ అయినట్లు సమాచారం.
‘బిగ్ బాస్’ సీజన్-7లో మేల్ కంటెస్టెంట్స్ ఏరివేత ప్రారంభమైంది. గత వారం సందీప్ మాస్టార్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఈ వారం టేస్టీ తేజా బయటకు వచ్చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగిందే.. హౌస్‌లో తన బెస్ట్ ఫ్రెండ్ కెప్టెన్సీని ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ పోయినట్లే. ఇక హౌస్ బయటకు వెళ్లి టీవీలో చూడాల్సిందే.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే:
ఈ వారం టేస్టీ తేజాతోపాటు శోభాశెట్టి, ప్రియాంక, యావర్, అశ్వినీ శ్రీ, రతిక, భోలే, అర్జున్‌లు నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే, ఇప్పటికే శోభా శెట్టి ఎలిమినేషన్ గండాన్ని గట్టెక్కింది. ఈ వారం కూడా ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని అనాధికార ఓటింగ్స్ ప్రకారం తెలుస్తోంది. టేస్టీ తేజ నామినేషన్స్‌లో ఉన్నప్పుడు శోభాశెట్టి అభిమానులు అతడికి ఓటేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదే తేజాకు గండంగా మారినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయ్యే తేజా ఈ సారి బయటకు వెళ్లక తప్పదని అంచనా. అంతేకాదు, ఈ విషయం తేజాకు కూడా అర్థమైపోయింది. స్వయంగా శివాజీ తేజాను నామినేట్ చేయడంతో హౌస్ నుంచి వెళ్లిపోవడం ఖాయమని తెలిసిపోయింది. ఈ వారమంతా తేజా దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు. తేజాకు నామినేషన్ వేసిన శివాజీ అతడికి ధైర్యం చెబుతున్నట్లు నటించినా అతడు మాత్రం నమ్మలేదు. పైగా తేజ హౌస్‌లో అందరికన్నా తెలివైనవాడు.. అన్ని రూల్స్ తెలిసినవాడు. బయట ఏం జరుగుతుందో కూడా అంచనా వేసేయగల్లడు. కాబట్టి, అతడు ఊహించిందే ఈ వారం జరగబోతుంది. రతికా ప్రస్తుతం శివాజీ భజన చేస్తూ, యావర్ వెంట ఉంటోంది. ఈ నేపథ్యంలో శివాజీ ఫ్యాన్స్ ఆమెను కాపాడే అవకాశాలున్నాయి. పైగా ఈ వారం తన ఆటతో పర్వాలేదు అనిపించింది.
కెప్టెన్‌గా శోభా శెట్టి..
శోభాశెట్టి ఎట్టకేలకు.. బిగ్ బాస్ సీజన్-7కు తొలి ఫిమేల్ కెప్టెన్ అయ్యింది. దీంతో శివాజీ తల బాదుకున్నాడు. ఈసారి ఎలాగైనా కెప్టెన్సీ సాధించాలనే లక్ష్యంతో శివాజీ ఉన్నారు. చేతికి గాయం ఉన్నా సరే ధైర్యంగా బరిలోకి దిగాడు. చివరి టాస్కులో అర్జున్ తరఫున రంగంలోకి దిగి మరోసారి చేతి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అయితే, సీరియల్ బ్యాచ్‌లో ఎవరికీ కెప్టెన్సీ రాకూడదనే టార్గెట్‌తో ఉన్నారు. కేవలం తనకు భజన చేసే యావర్, పల్లవి ప్రశాంత్, భోలే, అర్జున్ లేదా తాను మాత్రమే కెప్టెన్ అవ్వాలనే లక్ష్యంతో ఆడుతున్నాడు. సీరియల్ బ్యాచ్ కూడా తమ ఫ్రెండ్స్ మాత్రమే కెప్టెన్ అవ్వాలనే టార్గెట్‌తో ఆడుతున్నారు. దీంతో రెండు బ్యాచ్‌ల మధ్య గట్టి యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో శోభాశెట్టి కెప్టెన్ కావడాన్ని ఆ బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే శివాజీ తనకు ఇష్టంలేని గౌతమ్ కెప్టెన్సీపై కూడా విమర్శలు చేశాడు. ఇప్పుడు శోభాశెట్టి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో తన నోటికి పనిచెప్పే అవకాశాలు లేకపోలేదు. ఎప్పుడూ పూనకం వచ్చినట్లు ఊగిపోయే శోభాశెట్టి కెప్టెన్‌గా హౌస్ మేట్స్ మెప్పు పొందుతుందా? లేదా అదే ఆమెకు మైనస్‌గా మారుతుందా అనేది చూడాలి. ఆమె కోసం అంతగా శ్రమించిన అమర్‌కు ఆమె ఏవిధంగా సహాయ పడుతుందో చూడాలి. అయితే, కెప్టెన్సీ టాస్కులో ప్రియాంక జైన్ కూడా చాలా బాగా ఆడింది. వచ్చే వారం ఆమెకు ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఒక వేళ ఆమె కెప్టెన్సీ కంటెండర్‌గా ఉన్నా.. భోలేకు వ్యతిరేకంగా ఉండటం వల్ల శివాజీ బ్యాచ్ ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తారు. మరి, మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
నామినేషన్స్‌లో గౌతమే టార్గెట్
ఈ వారం గౌతమ్ గట్టిగానే నామినేషన్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ వారమంతా గౌతమ్.. శివాజీని ఎదురిస్తూనే ఉన్నాడు. పైగా అతడితో చాలాసార్లు వాగ్వాదానికి దిగాడు. ప్రతి మాటకు అడ్డుతగిలాడు. ఇది హౌస్‌లో ఉన్న శివాజీ భజన బ్యా్చ్‌కే కాదు, బయట ఆయన అభిమానులకు కూడా నచ్చకపోవచ్చు. కాబట్టి, ఈ వారం గౌతమ్‌కు గట్టిగానే నామినేషన్లు పడవచ్చు. శోభాశెట్టి ఈ వారం ఎలిమినేట్ కానట్లయితే.. ఇమ్యునిటీ లభిస్తుంది. కాబట్టి, ఆమెకు నామినేట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి, శివాజీ బ్యాచ్.. గౌతమ్, అమర్, అశ్వినీ, ప్రియాంకలను నామినేట్ చేస్తారు. సీరియల్ బ్యాచ్ కూడా తిరిగి వాళ్లనే నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూస్తుంటే.. ఈ వారం శోభాశెట్టి మినహా మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేషన్లలో ఉండే అవకాశం ఉంది.
Also Read: అందుకే రాహుల్ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు.. కేవలం రివ్యూవర్స్, ప్రేక్షకులు, సోషల్ మీడియాలో వెల్లడిస్తున్న అభిప్రాయాలు మాత్రమే. వీటికి ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.