Bigg Boss Telugu 7: దొంగలుగా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు - శోభాశెట్టి, యావర్ ఫైట్, చివాట్లు పెట్టిన పెద్దాయన!
బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా ‘దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర’ అనే టాస్క్ జరిగింది. అందులో కంటెస్టెంట్స్ అంతా నియమాలను అతిక్రమించారు.
బిగ్ బాస్ దగ్గర నుంచి తన స్నేహితుడు కొన్ని వస్తువులను తీసుకొని, తిరిగి ఇవ్వడం లేదని, ఇప్పుడు ఆ వస్తువులను తీసుకొచ్చే బాధ్యత కంటెస్టెంట్స్‌దే అని తెలియజేస్తూ తాజాగా ప్రోమో విడుదలయ్యింది. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ అంతా దొంగలుగా మారి బిగ్ బాస్ స్నేహితుడి దగ్గరకు వెళ్లి బిగ్ బాస్‌కు సంబంధించిన వస్తువులను దొంగలించుకొని రావాలి. ఇదే క్రమంలో పలువురు కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగి, బిగ్ బాస్ వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు.
దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర..
తాజాగా విడుదలైన ప్రోమోలో ముందుగా బిగ్ బాస్.. ‘‘మీ అందరికీ ఒక విషయంలో తెలియజేయాలనుకుంటున్నాను. నా స్నేహితుడు కొన్ని సంవత్సరాలుగా నా నుంచి ఎన్నో వస్తువులు తీసుకొని తిరిగి ఇచ్చేవాడు కాదు. ఇందుకోసం మీకు ఇస్తున్న టాస్క్.. ‘దొరికితే దొంగ.. దొరకకపోతే దొర’’ అని చెప్పారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా దొంగలుగా రెడీ అయ్యి.. ఎవరి మూటలను వారు తీసుకొని యాక్టివిటీ ఏరియాలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ బిగ్ బాస్ స్నేహితుడు నిద్రపోతున్నాడు. అతడిని లేపకుండా కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ వస్తువులను తిరిగి తీసుకొని రావాలి. దీంతో దొంగల్లాగా కంటెస్టెంట్స్ ప్రవర్తన ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది.
తేజ, శోభా టీమ్ మధ్య గొడవ..
నిన్న (అక్టోబర్ 3న) ప్రసారమయిన ఎపిసోడ్ ప్రకారం కంటెస్టెంట్స్ అంతా ఇప్పటికీ ఫ్రెండ్స్‌గా ఇద్దరిద్దరిగా కలిసి ఆడుతున్నారు. అయితే యాక్టివిటీ ఏరియా నుంచి వస్తువులను దొంగలించుకొని వచ్చిన తర్వాత టేస్టీ తేజ దగ్గర ఉన్న ఒక బిగ్ బాస్ వస్తువును దొంగిలించాలని చూసింది శోభా శెట్టి. శోభా శెట్టి - ప్రియాంక, టేస్టీ తేజ - ప్రిన్స్ యావర్ ఒక టీమ్ కాబట్టి కాసేపు ఈ రెండు టీమ్స్ మధ్య వాగ్వాదం జరిగింది. సందీప్ వచ్చి ఈ గొడవను ఆపాలని చూశాడు. శోభాశెట్టి ప్రవర్తనను సందీప్‌కు చూపించిన యావర్.. ఇది కరెక్టా అంటూ ప్రశ్నించాడు. ఇదంతా చూస్తున్న బిగ్ బాస్.. ‘‘మీరు చేస్తున్న పనిని తక్షణమే ఆపి జంటలుగా నిలబడండి’’ అంటూ ఆదేశించాడు.
టాస్క్ సరిగా ఆడలేదు..
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఒకటని కానీ దానిని కంటెస్టెంట్స్ వేరే విధంగా అర్థం చేసుకున్నారని బిగ్ బాస్ స్పష్టం చేశాడు. ‘‘టాస్క్ యొక్క అసలు స్వరూపాన్ని మార్చే స్వేచ్ఛ మీకు ఎంత మాత్రం లేదు. కానీ మీరు దానిని పట్టించుకోకుండా మీకు నచ్చినవన్నీ తీసుకొచ్చారు. కాబట్టి అడగనివి ఎన్ని దొంగిలించారు అనే విషయంపై నిర్ణయించడం జరుగుతుంది’’ అని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా తాము ఓడిపోతామేమో అని భయపడడం మొదలుపెట్టారు. జంటలుగా విడిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ మధ్య ఎన్నో వాగ్వాదాలు జరిగాయి. అయినా కూడా కెప్టెన్సీ టాస్క్ పూర్తయ్యే వరకు కంటెస్టెంట్స్ అంతా జంటలుగానే ఆడాలని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial