Bigg Boss Season 7 Telugu: కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ కామెడీ, తలుపుల మీద బాగా అవగాహన ఉందంటూ తేజపై కౌంటర్
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌తో కలిసి బిగ్ బాస్ కూడా కామెడీ చేయడం కొత్త అంశంగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 7 2.0 వర్షన్‌లో కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌గా విడిపోయారు. బిగ్ బాస్ హౌజ్‌లో అయిదు వారాల నుండి ఉంటున్న సీనియర్ కంటెస్టెంట్స్ అంతా ‘ఆటగాళ్లు’ అయిపోయారు. ఇక తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన అయిదుగురు కంటెస్టెంట్స్‌తో పాటు సీక్రెట్ రూమ్ నుండి మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కూడా ‘పోటుగాళ్లు’గా మారారు. ఇప్పటినుండి ఈ ఆటగాళ్లు, పోటుగాళ్లు మధ్య పోటీ మొదలుకానుంది. ప్రతీ ఆటలో ఈ రెండు టీమ్స్‌లో ఎవరు బెస్ట్ అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఈ రెండు టీమ్స్‌లో ఎవరు బెస్ట్ అని తెలుసుకోవడానికి బిగ్ బాస్ కొన్ని టాస్కులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
బెస్ట్ ఎవరు..
‘ఆటగాళ్లు, పోటుగాళ్లులో ఎవరు బెస్ట్ అని తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్.. ‘హూ ఈజ్ ది బెస్ట్’’ అని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్కులో ఆటగాళ్ల నుండి ఇద్దరు, పోటుగాళ్లు నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ పాల్గొనాలి. ఒక కంటెస్టెంట్.. స్విమ్మింగ్ పూల్‌లో ఉండి అందులోని టైర్లను పైకి అందిస్తుండగా.. మరొక కంటెస్టెంట్ బయట నుండి ఆ టైర్లను అందుకోవాలి. ప్రోమో చూస్తుంటే ఈ టాస్క్.. పోటాపోటీగా జరిగినట్టుగా అనిపిస్తోంది. ఇక ఈ ఫిజికల్ టాస్క్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు తమ మెదడును పరీక్షించే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కాసేపు తేజతో ఫన్ కూడా క్రియేట్ చేశారు బిగ్ బాస్.
జీనియస్ ఎవరు..
ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లులో బిగ్ బాస్ ఇచ్చిన రెండో టాస్క్.. ‘హూ ఈజ్ ది జీనియస్’. ఈ టాస్క్‌లో టీవీలో కొన్ని ప్రశ్నలను చూపిస్తారు బిగ్ బాస్. ఆటగాళ్లు నుండి ఒక కంటెస్టెంట్, పోటుగాళ్లు నుండి ఒక కంటెస్టెంట్ వచ్చి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ముందుగా బజర్ నొక్కిన వారికే సమాధానం చెప్పే అవకాశం లభిస్తుంది. మొదటి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం ఆటగాళ్లు నుండి అమర్‌దీప్.. పోటుగాళ్లు నుండి గౌతమ్ వచ్చారు. మొదటి ప్రశ్నకు అమర్ బజర్ నొక్కి సమాధానం ఇచ్చాడు. అయితే శివాజీ చెప్తేనే అమర్ సమాధానం చెప్పాడని పూజా మూర్తి ఆరోపించింది. కానీ దానికి ఆటగాళ్లు టీమ్ ఒప్పుకోలేదు.
అమర్‌దీప్ పోయి తేజ వచ్చాడు..
ఆ తర్వాత బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు అమర్‌దీప్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయగా.. బిగ్ బాస్ ఆ సమాధానికి కౌంటర్ ఇవ్వడంతో అందరూ నవ్వుకున్నారు. ఇక ఆటగాళ్లు టీమ్ నుండి అమర్‌దీప్ తప్పుకొని తేజను సమాధానాలు చెప్పడానికి పంపించాడు. తేజ ఎంటర్ అయిన తర్వాత ఫన్ మరింత డబుల్ అయ్యింది. ఒక జిమ్ పోజ్‌ను పెట్టి చూపించమని బిగ్ బాస్.. తేజను అడగగా.. కష్టపడి దానిని చేసి చూపించాడు తేజ. ఆ తర్వాత ‘ఇందులో ఏ తలుపు తెరవడం కష్టం?’ అంటూ కొన్ని తలుపుల ఫోటోలను చూపించారు బిగ్ బాస్. ఆ ఫోటోలను దగ్గరకు వెళ్లి గమనించి మరీ వాటి మీద కౌంటర్ వేశాడు తేజ. దానికి ‘‘మీకు తలుపుల మీద మంచి అవగాహన ఉంది’’ అంటూ తేజకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు బిగ్ బాస్.
Also Read: బిగ్ బాస్‌లో కింగ్ నాగ్ ధరించిన షర్ట్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial