Balakrishna: నటుడు చలపతి రావు పెద్ద కర్మ, నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆయన డిసెంబర్ 25 న హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా చలపతి రావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చలపతి రావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు బాలకృష్ణ. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నందమూరి బాలకృష్ణతో కలసి నటుడు చలపతి రావు ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన చనిపోయిన రోజు కూడా బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందన్నారు. చలపతిరావుకు తమ కుటుంబంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయని, అలాగే తన తండ్రి ఎన్టీఆర్ తో కలసి అనేక సినిమాల్లో నటించారని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబంలో ఒకడిలా చలపతి రావు ఉండేవారని అన్నారు. అలాగే తన సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్లు చేశారని చెప్పారు బాలకృష్ణ.
ఎన్టీఆర్ స్పూర్తితో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేశారు చలపతి రావు. ఆ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెల్లడించారు కూడా. ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే సినిమాల్లో మంచి నటుడిగా నిలదొక్కుకున్నారు. అలాగే ఎన్టీఆర్ సినిమాలలోనే ఎక్కువగా చేశారు చలపతి రావు. ఎన్టీఆర్ నటించిన ‘దానవీర శూరకర్ణ’ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తే చలపతి రావుకు ఐదు పాత్రలు ఇచ్చారట ఎన్టీఆర్. ఆ సినిమాలో చలపతి రావు ఇంద్రుడిగా, జరాసంధుడిగా, అతిరధుడి పాత్రలతో పాటు మరో రెండు అతిథి పాత్రల లో కనిపించారు. ఒక సినిమాలో ఇన్ని పాత్రలు చేసిన నటుడిగా అప్పట్లోనే చలపతిరావు రికార్డ్ సృష్టించారు. అందుకే చలపతి రావుకు ఎన్టీఆర్ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవి. చలపతి రావు ఎన్టీఆర్ కుటుంబంలో దాదాపు అందరి హీరోలతోనూ నటించారు. ఒక్క ఎన్టీఆర్ ఫ్యామిలీనే కాదు ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరి హీరోలతో నటించారు. అందరితోనూ చనువుగా, ఆత్మీయంగా ఉంటూ ఇండస్ట్రీలో అందరికీ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు.
Also Read : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ'
చలపతి రావు 1944, మే 8న క్రష్ఱా జిల్లా బలిపర్రు గ్రామంలో జన్మించారు. సినిమాల మీద మక్కువ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన దాదాపు 1200 సినిమాల్లో నటించారు. నటుడిగా, విలన్ గా, కామెడీ ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసేవారు. ఆయన 1966 లో వచ్చిన ‘గూఢచారి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రానించారు. దాదాపు ఏడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారాయన. అలాగే పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు నటుడు దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన కూడా తండ్రి బాటలో నటుడిగా రానిస్తున్నారు.