(Source: ECI/ABP News/ABP Majha)
Bahishkarana Teaser: మూడు పూటలా స్వర్గం చూపిస్తానంటున్న అంజలి - ‘బహిష్కరణ’లో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్న తెలుగు బ్యూటీ!
తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. త్వరలో జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఓరేంజిలో ఆకట్టుకుంటోంది.
Bahishkarana Teaser Review: తెలుగు హీరోయిన్ అంజలి కోలీవుడ్ లో రాణిస్తూనే, టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో వేశ్య పాత్రలో పోషించిన ఆమె, మరోసారి అలాంటి క్యారెక్టరే చేస్తోంది. అంజలి ప్రధాన పాత్రలో జీ5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా సంస్థ సంయుక్తంగా ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాయి. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జానర్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. జులై 19 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది.
మరోసారి వేశ్య పాత్ర పోషిస్తున్న అంజలి
త్వరలో ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రారంభంలో రేడియోలో వినిసొంపైన పాట వస్తుంది. చక్కటి పల్లెటూరు కనిపిస్తుంది. బస్సులో ఓ అమ్మాయి (అంజలి) ప్రయాణిస్తూ కనిపిస్తుంది. 'ఈ ప్రపంచం లొంగిపోయేది రెండింటికే... ఒకటి సొమ్ముకు, ఇంకోటి సోకుకు' అంటూ అంజలి చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో ఓ వైపు ప్రేమను పంచుతూనే, మరోవైపు కోపంతో రగిలిపోయే పాత్రను పోషిస్తున్నది అంజలి. ఇంతకీ ఆమె ఆ పల్లెటూరికి ఎందుకు వచ్చింది? అక్కడ తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆమె ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది? అనే విషయాలను ‘బహిష్కరణ’ సిరీస్ లో చూపించనున్నారు.
కీలక పాత్ర పోషిస్తున్న అనన్య నాగళ్ల
ఇక ఈ వెబ్ సిరీస్ లో ‘పుష్ప’ అనే పాత్రలో అంజలి కనిపించబోతుంది. మరో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఆమె కూడా ఇందులో ఓ పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తున్నట్లు టీజర్ ద్వారా వెల్లడవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో నటించడం పట్ల అంజలి సంతోషం వ్యక్తం చేసింది. “ఈ వెబ్ సిరీస్ లో ‘పుష్ప’ అనే పాత్రలో నటిస్తున్నాను. ఈ పాత్ర నాకు ఎంతో నచ్చింది. అమాయకపు వేశ్యగా మొదలైన నా ప్రయాణం, సమాజంలో అసమానతలను ప్రశ్నించే స్థాయికి చేరుకుంటుంది” అని అంజలి చెప్పుకొచ్చింది. పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్ కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. ఇందులో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, షణ్ముక్, చైతన్య సాగిరాజు సహా పలువురు కీలక పాత్రలు పోసించారు. ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సిద్ధార్థ్ సదాశివుని మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంతి మలిశెట్టి ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.
అంజలి రీసెంట్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాల్లో నటించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలోనూ అంజలి వేశ్యగా కనిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. తమిళంలోనూ కొన్ని సినిమాలు చేస్తోంది.
Also Read: రాజ్ తరుణ్ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు