(Source: Poll of Polls)
Ayodhya Ram Mandir: తెలుగులో ‘రామాయణం’ ఆధారంగా వచ్చిన సినిమాలు ఇవే - 1958 నుంచి 2023 వరకు!
తెలుగులో రామాయణంలో ఆధారంగా ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో కొన్ని క్లాసిక్స్ కూడా ఉన్నాయి.
అయోధ్యలో నేడు ఘనంగా రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ నేపథ్యంలో దేశం అంతటా రామ నామ స్మరణలో మునిగిపోయింది. ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరని మహాకావ్యం 'రామాయణం'. రామాయణం ఆధారంగా అనేక భాషల్లో ఎన్నో సినిమాలు, సీరియల్స్ తెరకెక్కాయి. తెలుగులోనూ రామాయణం నేపథ్యంలో అనేక చిత్రాలు రూపొందాయి. వీటిలో కొన్ని చిత్రాల్లో మొత్తం రామాయణం కథను చూపిస్తే, మరికొన్ని చిత్రాల్లో మాత్రం అందులోని కొన్ని కీలక ఘట్టాలను మాత్రమే తెర మీద ఆవిష్కరించారు. నేడు రామ మందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఆ సినిమాలేంటే ఒకసారి చూద్దాం.
1. సంపూర్ణ రామాయణం (1958)
తెలుగులో రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన మొదటి సినిమా 'సంపూర్ణ రామాయణం'. కె.సోము అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా ఎన్టీఆర్, సీత పాత్రలో పద్మిని నటించారు. మూడున్నర గంటలకు పైగా నిడివితో, శ్రీరాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకూ అన్ని ప్రధాన ఘట్టాలను ఈ చిత్రంలో చూపించారు. శ్రీరాముడు అంటే ఎన్టీఆర్ అని తెలుగు సినీ అభిమానులు భావించడానికి కారణమైన సినిమా ఇదే.
2. సీతారామ కళ్యాణం (1961)
రామాయణం ఆధారంగా ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. కానీ ఇందులో ఆయన రాముడి పాత్రలో కాకుండా రావణాసురుడి పాత్రలో కనిపించడం విశేషం. ఇందులో రాముడు, సీతల పరిణయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘సీతారామ కళ్యాణం’లో గీతాంజలి, హరనాథ్ జంట సీతా రాములుగా కనిపించారు. ఇప్పటికీ పెళ్ళి వేడుకలలో పాడుకునే 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి' అనే పాట ఈ సినిమాలోనిదే.
3. లవకుశ (1963)
సి.పుల్లయ్య, సి.ఎస్.రావు దర్శకత్వం వహించిన ‘లవకుశ’లో ఎన్టీఆర్, అంజలీదేవి రాముడు, సీత పాత్రల్లో కనిపించారు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత, సీతమ్మ కష్టాలను తెర మీద చూపించిన తొలి చిత్రమిది. తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ కలర్ సినిమా కూడా ‘లవకుశ’నే కావడం విశేషం.
4. సంపూర్ణ రామాయణం (1972)
బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'సంపూర్ణ రామాయణం'లో శోభన్ బాబు, చంద్రకళ సీతా రాములుగా నటించారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ తప్ప మిగిలిన ఆరు కాండలను ఈ సినిమాలో చూపించారు.
5. సీతా కళ్యాణం (1976)o
బాపు దర్శకత్వంలోనే సీతారాముల పరిణయ ఘట్టాన్ని అందంగా తెర మీద ఆవిష్కరించిన చిత్రం ‘సీతా కల్యాణం’. ఈ చిత్రంలో రవికుమార్, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు.
5. శ్రీరామ పట్టాభిషేకం (1978)
ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామాయణంపై తెరకెక్కిన మరో చిత్రం ‘శ్రీరామ పట్టాభిషేకం’. ఈ సినిమాలో రాముడు, రావణాసురుడు రెండు పాత్రల్లోనూ ఎన్టీఆరే నటించడం విశేషం. ఈ చిత్రంలో సీత పాత్రలో సంగీత కనిపించారు. రామాయణంలోని అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండలను ఈ సినిమాలో ఎన్టీఆర్ చూపించారు.
6. బాల రామాయణం (1997)
జూనియర్ ఎన్టీఆర్ బాల రాముడిగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ‘రామాయణం’. పూర్తిస్థాయిలో బాల నటీనటులతో ఈ సినిమా తెరకెక్కడం ఈ సినిమా ప్రత్యేకత. సీతారాముల జననం, పరిణయం, వనవాసం, సీతాపహరణం, రామ రావణ యుద్ధం, రాముడి పట్టాభిషేకం వంటి అన్ని ప్రధాన ఘట్టాలను ఈ సినిమాలో చూడవచ్చు. ప్రస్తుతం తెలుగు అగ్రకథానాయకుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశారు.
6. శ్రీరామ రాజ్యం (2011)
నందమూరి బాలకృష్ణ, నయనతార రాముడు, సీత పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరామ రాజ్యం’. బాపు-రమణ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘లవకుశ’ మాదిరిగానే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత పరిణామాలను చూపించారు.
7. ఆదిపురుష్ (2023)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూన్‌లో విడుదల అయింది. తెలుగు, హిందీలతో పాటుగా అనేక భారతీయ భాషల్లో, 3డీ & ఐమాక్స్ ఫార్మాట్‌లో ‘ఆదిపురుష్’ విడుదల అయింది. మొదట రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు చెప్పిన తర్వాత నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో మాట మార్చేశారు. ఈ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించారు. రావణుడిని తలపించే లంకేష్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని అందుకుంది.