Anausya 'Darja': అనసూయ 'దర్జా' చూశారా? కత్తి పట్టుకుని, జీప్ బ్యానెట్ మీద కూర్చుని!
ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ కత్తి పట్టుకున్నారు. జీప్ బ్యానెట్ ఎక్కి కోపంగా చూస్తున్నారు. మీరు ఆమె 'దర్జా'ను చూశారా?

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'దర్జా'. సునీల్ మరో ప్రధాన పాత్రధారి. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ ఫస్ట్ లుక్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కె.ఎల్. నారాయణ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "టైటిల్‌కు తగ్గట్టు ఫస్ట్ లుక్ కూడా 'దర్జా'గా ఉంది. సినిమా బాగా దర్జాగా ఆడి, యూనిట్ సభ్యులు అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎంతో బాధలో ఉన్నప్పుడు చేసిన సినిమా ఇదని అనసూయ చెప్పారు.
దర్శకుడు సలీమ్, నిర్మాత శివశంకర్ పైడిపాటి మాట్లాడుతూ "హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలోని అందమైన ప్రదేశాలలో 'దర్జా' చిత్రీకరణ చేశాం. సినిమా బాగా వస్తోంది. మాకు కామినేని శ్రీనివాస్ గారు ఇచ్చిన మద్దతు మరువలేనిది. అనసూయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. ఒకవైపు తండ్రి మరణించిన బాధలో ఉన్నప్పటికీ... తన వల్ల చిత్రీకరణకు ఎలాంటి అంతరాయం కలగకూడదని సెట్స్‌కు వచ్చి మాకు ఎంతో సహకరించారు. ఆమెతో పాటు సునీల్ గారు, ఇతర నటీనటులు మద్దతుగా నిలిచారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని చెప్పారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సునీల్, అనసూయ, పృథ్వీ, 'షకలక' శంకర్ తదితరులతో పాటు చిత్రబృంద సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి 'రాప్ రాక్' షకీల్ సంగీత దర్శకుడు.
View this post on Instagram





















