Anand Vaishnavi New Movie: కల్ట్ కాంబో రిపీట్ - కొత్త మూవీతో వస్తున్న ‘బేబీ’ టీమ్!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో మరో సినిమా ప్రస్తుతం తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది.
ఈ సంవత్సరం జులై నెలలో వచ్చిన ‘బేబి’ (Baby Movie) ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను ‘బేబి’ సాధించింది. భారీ వసూళ్లతో పాటు గట్టి ఇంపాక్ట్ కూడా చూపించింది. ఇప్పుడు ‘బేబి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరో హీరోయిన్లుగా ‘బేబి’ నిర్మాత ఎస్‌కేన్, దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. కొత్త దర్శకుడు రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
2024 సమ్మర్ రేసులో...
2024 సమ్మర్ సీజన్‌లో ఈ సినిమా విడుదల కానున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. ‘బేబి’ సినిమాకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్‌నే ఈ సినిమాకు కూడా స్వరాలు సమకూర్చనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ఇటీవలే నిర్మాత ఎస్‌కేన్ తాను నిర్మించబోయే తర్వాతి చిత్రాల అప్‌డేట్స్ కూడా అందించారు. తన సొంత నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ పై ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నలుగురు దర్శకులతో కలిసి దిగిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. తను ఎంతగానో నమ్మిన స్నేహితులతో సినిమా జర్నీ అందంగా ఉంటుందని రాసుకొచ్చారు. వీళ్లతోనే తన తదుపరి నాలుగు సినిమాలు రూపొందించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఎస్‌కేన్ షేర్ చేసిన ఫోటోలో డైరెక్టర్ సాయి రాజేష్ తో పాటు 'కలర్ ఫోటో' మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్, సుమన్ పాతూరి, రవి నంబూరి ఉన్నారు. వీరిలో రవి నంబూరితో సినిమాను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు.
వీరిలో 'కలర్ ఫోటో' సినిమాతో సందీప్ రాజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసారో తెలిసిందే. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత రీసెంట్గా సాయి రాజేష్ 'బేబి'తో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ డెలివరీ చేశాడు. మరోసారి ఈ ఇద్దరు దర్శకులతో ఎస్‌కేఎన్ ఎలాంటి సినిమాలు తీయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
యువ దర్శకులను ప్రోత్సహిస్తూ వాళ్ల నుంచి కంటెంట్ ఉన్న కథలు, మంచి అవుట్ ఫుట్ ని ప్రేక్షకులకు అందించడంలో ఎస్‌కేఎన్ 100 శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరోవైపు ఎస్‌కేఎన్‌కి గీతా ఆర్ట్స్ సంస్థ ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, యువ నిర్మాత బన్నీ వాస్... ఎస్‌కేఎన్ నిర్మించబోయే సినిమాలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటారు. గతంలో ఎస్‌కేఎన్ నిర్మాతగా మారి 'టాక్సీవాలా' సినిమా నిర్మించడం వెనక అల్లు అరవింద్, బన్నీ వాస్ ప్రోత్సాహం కూడా ఉంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial