Kaliyugam Pattanamlo Movie: కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు చూస్తారు - ఏయం రత్నం
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటించిన 'కలియుగం పట్టణంలో' సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకు సుమన్, ఏయం రత్నం ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.
''కలియుగం పట్టణంలో' టైటిల్ కొత్తగా ఉంది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన 'కలియుగం కలుషితం' పాట ఇంకా బావుంది. ఆ టైటిల్ పెడితే ఇంకా బాగుండేదని అనిపించింది. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎలాగూ చూస్తారు. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్'' అని ప్రముఖ నిర్మాత ఏయం రత్నం అన్నారు. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ సంస్థలపై తెరకెక్కింది.
రమాకాంత్ రెడ్డి కథ, కథనం, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కలియుగం పట్టణంలో' చిత్రాన్ని డా కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. ఈ శుక్రవారం (మార్చి 29న) థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ఏయం రత్నం, సుమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చంద్రబోస్ పాటలు రాయడం గొప్ప విషయం - సుమన్
'కలియుగం పట్టణంలో' హీరో విశ్వ కార్తికేయ తండ్రి రామానుజంతో తనకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుభంధం ఉందని, విశ్వను చిన్నతనం నుంచి చూస్తున్నాని, అతను మంచి కుర్రాడని సీనియర్ నటుడు సుమన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''విశ్వ కార్తికేయకు 'కలియుగం పట్టణంలో' సినిమాతో మంచి పేరు రావాలి. నిర్మాత ఓబుల్ రెడ్డి తన ఊరిలో సినిమా తీశానని చెప్పారు. ఆయనకు మంచి విజయం దక్కాలి. ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. రమాకాంత్ చక్కగా చేశారు. ఈ సినిమాలో పాటల్ని ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయడం గొప్ప విషయం. శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులు చూసి గొప్ప విజయం అందించాలని కోరుతున్నా'' అని చెప్పారు.
బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదని ముందుకొచ్చా - కందుల చంద్ర ఓబుల్ రెడ్డి
విద్యావేత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్న డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. సినిమాలపై ఫ్యాషన్ ఉన్న పిల్లలకు ఓ వేదిక కల్పించాలని నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశానని ఆయన చెప్పారు. ఇంకా మాట్లాడుతూ... ''మా ఊరు స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలనే కోరిక నాకు ఉంది. రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నచ్చి సినిమా చేస్తానని చెప్పా. అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని అన్నాడు. అయినా పర్లేదని ముందుకొచ్చా. ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. సినిమా సూపర్ హిట్ అవుతుంది'' అని అన్నారు. మరో నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ''సినిమా పూర్తి కావడానికి, విడుదల దగ్గరకు రావడానికి ఓబుల్ రెడ్డి కారణం. రమాకాంత్ నా ఫ్యామిలీ ఫ్రెండ్. సినిమాను బాగా తీశాడు. అజయ్ పాటలు, నేపథ్య సంగీతం, చంద్రబోస్ గారి సాహిత్యం అద్భుతంగా ఉంటాయి'' అని చెప్పారు. నాని గారి సహకారం వల్ల సినిమా ఇంత బాగా వచ్చిందని మరో నిర్మాత కాటం రమేష్ తెలిపారు.
Also Read: 'సింబా'లో రణవీర్ టీచర్... కలియుగం పట్టణంలో పోలీస్... సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్!
థియేటర్లలో సినిమా చూడండి - దర్శకుడు రమాకాంత్ రిక్వెస్ట్
'కలియుగం పట్టణంలో' సినిమా కోసం ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారితో పని చేయడం, ఆయన తమ సినిమాలో పాటలు రాయడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''అజయ్ ఆరసాడ మంచి మ్యూజిక్ ఇచ్చారు. విశ్వ కార్తికేయ, నరేన్ రామ, ఆయుషి పటేల్ చక్కగా నటించారు. దేవీ ప్రసాద్ వంటి సీనియర్ నటులతో పని చేయడం మంచి అనుభూతి. నిర్మాత మహేష్ నా ఫ్యామిలీ ఫ్రెండ్. మరో నిర్మాత రమేష్ గారు కాలిక్యులేటెడ్‌గా ఉంటారు. ఓబుల్ రెడ్డి గారు సోదర సమానులు'' అని చెప్పారు. ప్రేక్షకులందరూ థియేటర్లలో సినిమా చూడాలని రిక్వెస్ట్ చేశారు.
Also Read: టాలీవుడ్‌లోకి మరో వారసుడు - రచ్చ గెలిచి 'కలియుగం పట్టణంలో'తో ఇంటికి వస్తున్న గుమ్మడి మనవడు
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, రచయిత & దర్శకుడు రాజా, ఆదిత్య మ్యూజిక్ మాధవ్, దర్శకుకు నీలకంఠ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.