DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?
'డీజే టిల్లు2'లో ఓ గ్లామరస్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. దానికి తగ్గట్లే యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేసుకున్నారు.
టాలీవుడ్ లో హీరోగా చాలా సినిమాలు చేశారు సిద్ధూ జొన్నలగడ్డ. అయితే 'డీజే టిల్లు' మాత్రం అతడి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇప్పుడు యూత్ లో సిద్ధూ క్రేజ్ పెరిగిపోయింది. టిల్లు క్యారెక్టర్ తో అతడు చేసిన రచ్చ అలాంటిది మరి. ఈ సినిమాలో నటించడమే కాకుండా.. రైటర్ గా కూడా పని చేశారు సిద్ధూ. గతంలో కూడా తను నటించిన 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాథ వినుమా' వంటి సినిమాల స్క్రిప్ట్స్ పై వర్క్ చేశారు సిద్ధూ.
ఆ సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. 'డీజే టిల్లు' అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధూ రేంజ్ పెరిగిపోయింది. దీంతో తాను ఒప్పుకున్న వేరే సినిమాలను వదులుకొని మరీ 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు సిద్ధూ జొన్నలగడ్డ. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నేహాశెట్టినే కనిపిస్తుందని అనుకున్నారు.
కానీ ఆమెది కేవలం గెస్ట్ రోల్ అని సమాచారం. 'డీజే టిల్లు2'లో ఓ గ్లామరస్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. దానికి తగ్గట్లే యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు ఈమె షూటింగ్ లో కూడా పాల్గొంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని సమాచారం. ప్రస్తుతం శ్రీలీలకు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. రవితేజ సరసన ఆమె నటించిన 'ధమాకా' సినిమా మరికొద్దిరోజుల్లో విడుదల కానుంది.
ఈ సినిమా తరువాత ఇండస్ట్రీలో ఆమెకి స్టార్ హీరోల సరసన ఛాన్స్ వస్తుందని భావిస్తుంది శ్రీలీల. ఇలాంటి సమయంలో సిద్ధూ లాంటి యంగ్ హీరో సరసన నటిస్తే.. స్టార్ హీరోలు లైట్ తీసుకుంటారేమోనని భయపడుతుంది. ఈమె అనుమానాలకు తగ్గట్లే 'డీజే టిల్లు' తరువాత నేహాశెట్టికి పెద్ద హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. దీంతో శ్రీలీల రిస్క్ ఎందుకని ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని అంటున్నారు. 'భీమ్లానాయక్' బ్యూటీ సంయుక్త మీనన్ ను కూడా ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె కూడా నో చెప్పిందట.
సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు:
'డీజే టిల్లు' సీక్వెల్ కి దర్శకుడు కూడా సిద్ధూనే అని టాక్. నిజానికి ఫస్ట్ పార్ట్ కి సిద్ధూ కథ, మాటలు అందించారు. స్క్రీన్ ప్లేలో కూడా భాగం పంచుకున్నారు. కాబట్టి ఈసారి కూడా అవే బాధ్యతలు నిర్వర్తిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి అతడు డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ నిరూపించడానికి రెడీ అవుతున్నారట. ఫస్ట్ పార్ట్ ను డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణనే దర్శకుడిగా కొనసాగించాలని అనుకున్నప్పటికీ.. అతడికి వేరే కమిట్మెంట్స్ ఉండడంతో అతడు ఈ ప్రాజెక్ట్ చేయలేకపోతున్నాడని సమాచారం.
Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ
Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్