Ramayana: అలియా, రణ్‌బీర్‌లతో ‘రామాయణం’ మూవీపై ఓం రౌత్ కామెంట్స్
‘ఆదిపురుష్’ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా, మరో దర్శకుడు రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించారు. జూన్ 16న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు సినిమా బాగుందంటే, మరికొంత మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇలాగే ఉంటుందా? అంటూ పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ‘ఆదిపురుష్’ సినిమాపై నెగెటివ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలోనే మరో దర్శకుడు నితీష్ తివారీ రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాపై దర్శకుడు ఓం రౌత్ స్పందించడం విశేషం. అంతేకాదు, నితీష్‌కు శుభాకాంక్షలు కూడా చెప్పారు. రామాయణంపై నితీష్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆలియా సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు.
నితీష్ రామాయణంపై ఓం రౌత్ కీలక వ్యాఖ్యలు
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ రామాయణంపై ఓం రౌత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “నితీష్ మంచి ఫిల్మ్ మేకర్. రామాయణంపై ఎన్ని ఎక్కువ సినిమాలు తీస్తే అంత మంచిది. నితేష్ నాకు మంచి స్నేహితుడు. నేను అతడి పనిని దగ్గరుండి చూశాను. దేశంలోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటైన ‘దంగల్’ సినిమా సమయంలో ఆయన పనితీరును గమనించాను. నటీనటుల పనితీరుతో పాటు నితీష్ శ్రమ ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించింది. నితీష్ తెరకెక్కించే రామాయణం కోసం ప్రతి రామభక్తుడిలాగే నేనూ ఎదురు చూస్తున్నాను. రామాయణం, ప్రభు శ్రీరామ్ పై చాలా సినిమాలు రావాలి. రామాయణం మన దేశానికి సంబంధించిన గొప్ప చరిత్ర” అని వెల్లడించారు.
నితేష్ తివారీ రామాయణం గురించి..
నితీష్ రామాయణం సినిమాకు సంబంధించి ఆలియా ఎంపిక అయ్యిందని కొద్ది రోజుల కొన్ని నివేదికలు వెల్లడించాయి. కానీ, సినిమా చాలా ఆలస్యం కావడంతో దర్శకుడు నితీష్, నిర్మాత మధు మంతెన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రకు రణబీర్ ను తీసుకోవాలనుకున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ తాజాగా నితీష్ కార్యాలయంలో కనిపించారు. ఈ నేపథ్యంలో బయటకు వస్తున్న వార్తలు వాస్తవమేనని తేలింది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.
రెండు రోజుల్లో ‘ఆదిపురుష్’ వసూళ్లు ₹240 కోట్లు
‘ఆదిపురుష్’ చిత్రాన్ని రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ₹240 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ ఆదివారం ప్రకటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విడుదలైన రెండవ రోజు ₹100 కోట్లు వసూలు చేసిందని ప్రొడక్షన్ బ్యానర్ టీ-సిరీస్ తెలిపింది. విడుదలైన మొదటి రోజున ₹140 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
Read Also: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ కంటెస్టెంట్ ఔట్, ఇదే ఫస్ట్ టైమ్!