Samantha: ప్రకృతితో మమేకం, దైవ చింతనకు దగ్గరగా- భూటాన్ లో సామ్ ఎంజాయ్
సినిమాలను తగ్గించి ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన సమంత, మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే భూటాన్ లో ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది.
అందాల తార సమంత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో 2010లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఆడియెన్స్ ను పూర్తిగా మాయ చేసేసింది. ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాలతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో దాదాపు దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయడం తగ్గించేసింది. ఈ ఏడాది కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది. గత ఏడాది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది సమంత. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది. అయినా, ఇంకా పూర్తి స్థాయిలో ఆ సమస్య నుంచి బయటపడలేదు.
మానసిక ప్రశాంతతపై సమంత ఫోకస్
ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆరోగ్యం మీదే ఫోకస్ పెట్టింది. ఓవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే, మరోవైపు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. శరీరాన్ని, మనసును ఒత్తిడి నుంచి కాపాడుకునేందుకు దారులు వెతుకుతోంది. అందులో భాగంగానే పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. ప్రకృతితో మమేకం అవుతూనే, దైవ చింతనలో గడుపుతోంది. ఓవైపు మెడిటేషన్, మరోవైపు మెడికేషన్ తో ముందుకు సాగుతోంది. అటు అమెరికాలో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సుమారు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సమంత ఈ సమయంలో పూర్తిగా ఫిట్ నెస్ సాధించాలని భావిస్తోంది.
భూటాన్ లో ఎంజాయ్ చేస్తున్న సామ్
ఇక సినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత కొంత కాలం పాటు బాలిలో ఎంజాయ్ చేసిన సమంత, మళ్లీ ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నది. ప్రస్తుతం మళ్లీ టూర్లు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ భూటాన్ లో పర్యటిస్తోంది. ఆదేశ రాజధాని థింపులోని పర్యాటక ప్రాంతాల్లో అందాలను ఆస్వాదిస్తోంది. అక్కడి ప్రముఖ బౌద్ధ ఆలయాలను చుట్టేస్తోంది. అక్కడి అందాలను తను చూడటంతో పాటు తన అభిమానులకు చూపించే ప్రయత్నం చేస్తోంది. చక్కటి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక మయోసైటిస్ నుంచి సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ పర్యటనల ద్వారా ఆమె శారీరకంగా, మానసికంగా మెరుగ్గా తయారు కావాలని కోరుకుంటున్నారు. వీలైనంత త్వరగా అన్ని సమస్యల నుంచి బయటకపడాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ వెండితెరపై సందడి చేయాలని ఆశిస్తున్నారు. ఇక ఆమె నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఓ హాలీవుడ్ మూవీ కూడా విడుదల కానుంది. మరోవైపు నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది.
View this post on Instagram
Read Also: రజనీకాంత్ దీపావళి ట్రీట్, ‘లాల్ సలామ్‘ ట్రైలర్ విడుదల, డిఫరెంట్ లుక్లో ఆకట్టుకున్న సూపర్ స్టార్