Vijay Deverakonda: ప్రభాస్ వీడెవర్రా బాబూ అన్నాడు - నేను నాలాగే ఉంటా: ‘ఆటిట్యూడ్’ కామెంట్స్‌పై విజయ్, దిల్ రాజు స్పందన
తనకు ఆటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారని విజయ్ దేవరకొండ అన్నారు. కానీ, నేనెప్పుడూ నాలాగే ఉంటానని చెప్పారు. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Vijay Deverakonda About his Attitude: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ మధ్యతరగతి యువకుడిలా కనిపిస్తున్నాడు. సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో హీరో, హీరోయిన్లు విజయ్, మృణాల్ తో పాటు నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. సినిమాతో పాటు పలు వ్యక్తిగత విజయాలను వెల్లడించారు.
నేనెప్పుడూ నాలాగే ఉంటాను: విజయ్
చాలా మంది తనకు ఆటిట్యూడ్ ఎక్కువ అని భావిస్తారని, అయితే, వారికి తన గురించి ఎక్కువగా తెలియదని విజయ్ దేవరకొండ అన్నారు. “నేనెప్పుడూ నాలాగే ఉంటాను. నేను కూర్చొనే విధానం చూసి ఆటిట్యూడ్ ఎక్కువ అనడం కరెక్ట్ కాదు. నా కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లినప్పుడే సక్సెస్ వస్తుంది. స్టార్ గా ఓ స్థాయికి వెళ్లాలంటే ఇలాంటి విమర్శలు తప్పవు. ఫ్రీగా ఎవరూ రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్లడు” అని చెప్పారు.
విజయ్ గురించి తెలియని వాళ్లే అలా అనుకుంటారు: దిల్ రాజు
తనను కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాగా ఆటిట్యూడ్ ఉందని భావించేవాళ్లని దిల్ రాజు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభాస్ తనకు చెప్పాడని వెల్లడించారు. “కెరీర్ తొలినాళ్లలో నాకు చాలా ఆటిట్యూడ్ ఉందని చాలా మంది అనుకునేవారు. ప్రభాస్ ఓ రోజు నాకు ఈ విషయాన్ని చెప్పాడు. నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఇలా చూస్తావ్? అలా చూస్తావ్? వీడెవర్రా బాబూ, ఇంత ఆటిట్యూడ్ ఉంది? అనుకునే వాణ్ణి అన్నాడు. నాతో ఆయన క్లోజ్ అయ్యే వరకు అదే ఒపీనియన్ ఉండేది. విజయ్‌కు ఆటిట్యూడ్ ఉందని చాలా మంది అనుకుంటారు. వారికి ఆయన గురించి తెలియదు” అన్నారు.
ఎవరూ 100 శాతం సక్సెస్ కారు: దిల్ రాజు
“జీవితం అందరికీ అన్నీ నేర్పిస్తుంది. ఎవరూ 100 శాతం సక్సెస్ కాలేరు. పవన్ కల్యాణ్ లాంటి హీరో 10 ఏండ్లలో ‘జల్సా’ అనే ఒకే ఒక్క సినిమా సక్సెస్ అయ్యింది. కానీ, ఆయన స్టార్ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. హీరోలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. దర్శకులు, నిర్మాతలకు అసలు సమస్యలు ఉంటాయి. సినిమాలు ఫ్లాప్ అయితే, డబ్బుపోతుంది. నిలదొక్కుకోలేం. దర్శకులకు కూడా వరుసగా రెండు ఫ్లాపులు వస్తే మూడో అవకాశం ఇవ్వరు. నెగెటివ్ కామెంట్స్ ను నేను పెద్దగా పట్టించుకోను. వాటిని పట్టించుకుంటే నేను ముందుకు వెళ్లలేను. నేను కరెక్టుగా ఉన్ననా? లేదా? నేను కరెక్ట్ చేస్తున్నానా? లేదా? అనేదే నా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. నిజాయితీగా ముందుకు వెళ్తున్నప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు” అని దిల్ రాజు చెప్పారు.