Surya on Prabhas: ప్రభాస్, ఆ రోజు నా కోసం డిన్నర్ కూడా తినకుండా వేచి చూశాడు - హీరో సూర్య
ఆతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్ ను మించిన హీరో టాలీవుడ్ లో మరెవరూ లేరని చెప్పుకోవచ్చు. తన ఇంటి వంటల రుచికి ఎంతో మంది నటీటులు ఫిదా కాగా, తాజాగా ఆ లిస్టులో తమిళ స్టార్ హీరో సూర్య చేరారు.
ప్రభాస్ గురించి ఒక్క మాట చెప్పండి అని సినీ పరిశ్రమకు చెందిన ఎవరిని అడిగినా.. ‘‘ఆయన ఫుడ్ పెట్టి చంపేస్తాడండీ’’ అని చెప్తారు. తనతో పాటు నటించే వారికి అత్యంత రుచికరమైన భోజనాన్ని కడుపునిండా తినిపిస్తాడు. ‘ప్రాజెక్ట్ కే’, ‘సలార్’ సినిమాలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్, శ్రుతి హాసన్ సహా పలువురు నటీనటులకు కూడా ప్రభాస్ తన ఇంటి వంట రుచి చూపించారు. తాజాగా ప్రభాస్ ఆతిథ్యానికి తమిళ హీరో సూర్య కూడా క్లీన్ బౌల్డ్ అయ్యారు.
ప్రభాస్ ఆతిథ్యానికి సూర్యా ఫిదా
తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో పక్క పక్కనే ప్రభాస్, సూర్య సినిమాల చిత్రీకరణ కొనసాగుతోంది. అదే సమయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. అప్పుడు ప్రభాస్, సూర్యను డిన్నర్ కు ఆహ్వానించారు. సూర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాలు తెలిపాడు. “ప్రభాస్, నేను ఫిల్మ్ సిటీలో కలుసుకున్నాం. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఆ సమయంలోనే నన్ను డిన్నర్ కు ఆహ్వానించారు. కలిసి భోజనం చేద్దామని చెప్పారు. అయితే, ఏదైనా హోటల్.. లేదంటే ప్రొడక్షన్ మెస్ ఫుడ్ వస్తుందనుకున్నాను. నా షూటింగ్ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరగాలి. కానీ, రాత్రి 10 నుంచి 11.30 వరకు జరిగింది. అప్పటికే ప్రభాస్ వెళ్లిపోయి ఉంటారు అని అనుకున్నాను. ఉదయాన్నే తనను కలిసి సారీ చెప్దాం అనుకున్నాను. కానీ, ఆయన నాకోసం రాత్రి 11.30 వరకు డిన్నర్ తినకుండా వేచి చూస్తున్నారు. నేను కారిడార్ లో నడుస్తుండగా నా రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. ప్రభాస్ బయటకు వచ్చి, సార్ నేను రెడీ అయ్యాను. మీరు స్నానం చేసి రండి.. డిన్నర్ చేద్దాం అన్నారు. నేను షాక్ అయ్యాను. రాత్రి 11.30 వరకు ప్రభాస్ నా కోసం డిన్నర్ చేయకుండా ఉన్నారా? అనుకున్నాను. నేను స్నానం చేసి వెళ్లాను. ఇంటి నుంచి తెచ్చిన వంటకాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ అమ్మగారు చేసిన బిర్యానీ రుచి చూపించారు. అంత మంచి బిర్యానీ ఎప్పుడు తినలేదు” అని సూర్య చెప్పారు.
వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్, సూర్య
ఇక ప్రభాస్, సూర్య సౌత్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. జై భీమ్, విక్రమ్, సూరరై పొట్రు లాంటి సినిమాతో సూర్య సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ మంచి స్వింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’లో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రాజెక్ట్ కె, సలార్ కూడా లైన్ లో ఉన్నాయి. సూర్య కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.
Read Also: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్