Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కోలీవుడ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’ సీక్వెల్ లో నటించనుంది. కంగనా తాజాగా ‘తలైవి’ మూవీలో నటించి మెప్పించింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తమిళ నాట మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల ‘తలైవి’ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆమె.. ప్రస్తుతం దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్న ‘చంద్రముఖి-2’లో టైటిల్ రోల్ చేయనుంది. ఇప్పటికే కంగనా ఈ సినిమాకు సైన్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
సంచలన విజయాన్ని అందుకున్న ‘చంద్రముఖి’
2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక నటించారు. ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక కనబర్చిన నటనకు అప్పట్లో ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. గంగ అనే క్యారెక్టర్ లో చాలా అమాయకంగా కనిపస్తూనే చంద్రముఖి అనే భయానక పాత్రలో నటించి మెప్పించింది. చంద్రముఖిగా ఆమె డ్యాన్సును చూసి.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పట్లో రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. చంద్రముఖి మలయాళ మూవీ ‘మణిచిత్రతాజు’ అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ‘భూల్ భులైయా’గా తెరకెక్కింది. ఈ సినిమా కూడా అక్కడ బాగానే ఆడింది.
చంద్రముఖి-2లో కంగనా, లారెన్స్
గత కొంత కాలంగా ‘చంద్రమఖి’ సీక్వెల్ పై కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే, చాలా మంది సీక్వెల్ లో కూడా జ్యోతికనే తీసుకుంటారు అని భావించారు. కానీ, దర్శకుడు వాసు మాత్రం కంగనాను ఓకే చేశారు. ‘చంద్రముఖి 2’లో చంద్రముఖి టైటిల్ రోల్‌లో నటించనుంది. ఈ సినిమాలో కంగనా.. రాజు గారి ఆస్థానంలో ప్రముఖ నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ సరసన ప్రముఖ దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు.
కాస్ట్యూమ్ డిజైనర్ గా నీతా లుల్లా
అటు ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత అయిన కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయబోతున్నారు. ఈ సినిమాలో కంగనా పాత్ర స్కెచ్ తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందని నీతా వెల్లడించింది. “ఈ సినిమాలో కంగనా ప్రతి అడుగు నన్ను ఎంతో ఆకట్టుకుంది. దయతో నిండిన ఆమె పాత్ర కోసం, తన రూపం, జుట్టు, నడక, వైఖరి అన్నీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఆమె డ్యాన్స్ మరో ఎత్తు. ఈ సినిమా నాకు ఓ ఛాలెంజింగ్. ఈ ప్రాజెక్టులో కంగనాతో కలిసి పని చేయడం పట్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. నటిగా తనకు ఈ సినిమా ఓ అద్భుత గుర్తింపు తీసుకువచ్చే అవకాశం ఉంది” అని చెప్పింది.
డిసెంబర్ తొలి వారంలో షూటింగ్ ప్రారంభం
ఇక ‘చంద్రముఖి-2’ తొలి షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో మొదలుకానుంది. అటు కంగనా తన మరో మూవీ ‘ఎమర్జెన్సీ’ నుంచి కొంత విరామం తీసుకోనుంది. ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ‘చంద్రముఖి-2’ రెండో షెడ్యూల్ జనవరిలో ప్రారంభం అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని అతిపెద్ద నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అటు కంగనా రనౌత్ ‘తేజస్’ అనే మరో సినిమా కూడా చేస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించనుంది.
Read Also: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్ ఆమేనా?