వెంట్రుక పీకలేవ్ అంటూ వార్నింగ్- వంశీ కృష్ణ శ్రీనివాస్‌పై విశాఖ ఎంపీ ఎంవీవీ ఫైర్
Visakha MP MVV Satyanarayana: వైసీపీని వీడి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ, ఆ పార్టీ నగర అధ్యక్షుడు సీహెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Visakha MP MVV Fires On Vamsi Krishna Srinivas: విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ.. వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌పై ఫైర్ అయ్యారు. వైసీపీని వీడి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ, ఆ పార్టీ నగర అధ్యక్షుడు సీహెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెలగపూడితో కలిసి ఎంపీ ఎంవీవీపై వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలపై స్పందించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయంలో మాట్లాడారు. వంశీ తన చేతి వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటుగా ఎంపీ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనపై చేసిన భూ కబ్జాల ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపైనా ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా, లేకపోయినా తాను వ్యాపారాలు చేశానని, నిజాయితీతోనే వ్యాపారాలు సాగిస్తున్నానని ఎంవీవీ స్పష్టం చేశారు.
రంగాను ఎలా చంపారో తెలియజేస్తామన్న ఎంవీవీ
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కాపుల ఆరాధ్య నేత వంగవీటి మోహనరంగాను ఎలా చంపారో, తూర్పు నియోజకవర్గంలోని యదవులను, మత్స్యకారులను ఎలా మోసం చేశారో ప్రజలకు తెలియజేస్తామన్నారు. వంశీ కృష్ణ శ్రీనివాస్ కుక్క కంటే దారుణమైన జాతి అని, పందికి సరిపోతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కల్తీ సారా అమ్ముకుని రాజకీయాలు చేసే వ్యక్తి తన గురించి మాట్లాడడం దారుణమన్నారు. వంశీ మాదిరిగా నిస్సిగ్గుగా తాను మాట్లాడలేనని, ఆయన చేసిన ఆరోపణలకు తన వద్ద సమాధానాలు ఉన్నాయన్నారు. వంశీ తనను ఏమీ చేయలేడని, రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేని వ్యక్తి తన గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు.
ఎమ్మెల్యే వెలగపూడి తూర్పు నియోజకవర్గంలోని యాదవులకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 62 ఏళ్ల వయసులో పదవీ భయం పట్టుకుని వెలగపూడి దిగజారుడు విమర్శలు చేస్తున్నాడన్నారు. గతంలో రామకృష్ణ బాబుపై, పవన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్టు వంశీ మాట్లాడిన వీడియోలు ఉన్నాయని, ఫ్రస్టేషన్‌లో ఏదో మాట్లాడుతున్నాడని ఎంపీ పేర్కొన్నారు. ఏయూ వీసీ, తన అంతు చూస్తానని వంశీ చెబుతున్నాడని, ఏం చేస్తావో చేసుకోవాలంటూ సూచించారు. వెలగపూడి మూడుసార్లు యాదవులను ఓడించాడని, తన పార్టీలో కూడా యాదవ నాయకులు ఎదగకుండా అడ్డుకుంటున్నాడన్నారు.
తన పార్టీ నుంచి పోటీ చేసిన 12 మంది యాదవ సామాజికవర్గానికి చెందిన కార్పొరేటర్లు గెలవకుండా ఓడించిన వ్యక్తి వెలగపూడి అని పేర్కొన్నారు. వంశీని ఓడించిన వెలగపూడి, ఇప్పుడు సిగ్గు లేకుండా వాడి ఇంటికి వెళ్లి కూర్చున్నాడని, వాడు తిడుతుంటే నవ్వుకుంటున్నాడని, ఇదే పద్ధతి అని ప్రశ్నించారు. కాపుల ఆరాధ్య దైవం రంగాను అడ్డంగా నరికి చంపిన వెలగపూడి.. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని, రంగాను చంపిన విషయాన్ని గతంలోని టీడీపీ ప్రభుత్వమే కేసు ఫైల్ చేసి తేల్చిందన్నారు.
ఓట్లు పడితే ఎందుకు ఓడిపోతావని సూటి ప్రశ్న
తనను ఓడిస్తానంటూ వంశీ శపథాలు చేస్తున్నాడని, తనకు ఓట్లేయని జనాలను నాకు ఓట్లేయొద్దంటే మానేస్తారా..? అని ప్రశ్నించారు ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా గెలవని వంశీ వద్దంటే తనకు ప్రజలు ఓట్లేయకుండా ఉండరని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి పుణ్యంతో కార్పొరేటర్‌గా గెలిచాడని, పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు పెద్ద నాయకుడిలా ప్రగల్భాలు పలికాడని, 27 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు వస్తున్నారంటూ గొప్పలు చెప్పాడని, ఒక్క కార్యకర్తను కూడా తనతో తీసుకెళ్లలేదన్నారు. టికెట్ ఇస్తారో, ఇవ్వరో తెలియని వ్యక్తి, ఇస్తే గెలుస్తాడో, లేదో నమ్మకం లేని వ్యక్తి మంత్రి అవుతానంటూ భ్రమల్లో బతికేస్తున్నాడని ఎంపీ ఎంవీవీ ఎద్దేవా చేశారు.
టికెట్ ఇచ్చినా నామినేషన్ ఖర్చులకు కూడా ఎవరో ఒకరు డబ్వులు ఇవ్వాలని, తూర్పు నియోజకవర్గంలో ఎంతో మందిని మోసం చేసిన ఘనత వంశీదేనన్నారు. ఇప్పటి వరకు తూర్పులో మూడు నెలల్లో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని, జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నానని, ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు ఇప్పటి వరకు చేయలేదన్నారు. వంశీకి గెటప్ వేస్తూ బాబూమోమన్ సోదరుడిలా ఉంటాడనని, ఓ సినిమాలోని ఖాన్ దాదా తరహాలో హెచ్చరికలు జారీ చేయడం కామెడీగా ఉందన్నారు. వంశీ పట్ల తనకు కోపం లేదని, జాలి మాత్రం ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చి అప్పులు పాలై నష్టపోయాడని, ఇప్పటికైనా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎంవీవీ సత్యనారాయణ సూచించారు.