UP Election Result 2022: యూపీని ఊపేసిన యోగి మేనియా- అయ్యగారి తర్వాత ఆయనే- 2024లో ప్రధాని అభ్యర్థిగా!
UP Election Result 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి చేత్తో భాజపాను గెలిపించిన యోగి ఆదిత్యనాథ్.. ప్రధాని రేసులో ఉన్నారా?
యోగి ఆదిత్యనాథ్.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి భాజపా సర్కార్ కొలువుదీరడంలో యోగి పాత్ర ప్రత్యేకం. ముఖ్యంగా రౌడీయిజం, మాఫియా దందాలతో ఉక్కిరిబిక్కిరైన యూపీని.. అభివృద్ధి పథం వైపు యోగి తీసుకువచ్చారని విశ్లేషకులు చెప్పిన మాట. పరిపాలనలోనూ యోగికి ప్రత్యేక స్టైల్ ఉందని భాజపా సీనియర్ నేతలే ఎన్నోసార్లు చెప్పారు. అంతేకాకుండా మోదీ తర్వాత భాజపాలో పవర్‌ఫుల్ లీడర్ ఎవరంటే యోగి పేరే వినిపిస్తోంది. మరి యోగిని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా భాజపా చూస్తుందా?
రేసులో యోగి
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా భాజపా భావిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, భాజపా చాణక్యుడు అమిత్ షా కూడా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగిని.. కాబోయే ప్రధానిగా ప్రజలు భావించడం సహజమేనన్నారు.
సీఎం యోగిని కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రజలు చూస్తున్నారని, దీనిపై మీరేమంటారు అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు.
" ఇది సహజమే. యోగి నాయకత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నో ఏళ్లుగా లేని అభివృద్ధి జరిగింది. యూపీలో 30 వైద్య కళాశాలలు వచ్చాయి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల వచ్చేలా చూస్తున్నాం. రాష్ట్రంలో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు ఉన్నాయి. రాష్ట్రంలో 10 కొత్త విశ్వవిద్యాలయాలు, 77 కళాశాలలు భాజపా సర్కార్ నిర్మించింది. 1.4 లక్షల కాలేజీలను అభివృద్ధి చేశాం. "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
శాంతిభద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగు పరిచేందుకు యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమించారు. అలానే రహదారుల అనుసంధానాన్ని అభివృద్ధి చేశామని.. గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించామన్నారు.
" యోగి ఆదిత్యానాథ్.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు తీవ్రంగా శ్రమించారు. దొంగతనాలు, అత్యాచారాల కేసులు 30-70 శాతం పడిపోయాయి. యూపీలో ఇంతకుముందు ఎప్పుడు ఇంత మంచి రహదారులు లేవు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఎక్స్‌ప్రెస్‌వేలతో అనుసంధానం చేశారు. "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
వయసు
2024లో భాజపా మళ్లీ అధికారంలోకి రావాలంటే యూపీలో యోగి ఆదిత్యనాథ్ సాధించిన ఈ గెలుపు చాలా కీలకం కానుంది. ఇదే జోష్‌తో భాజపా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సార్లు ప్రధాని పదవిని నరేంద్ర మోదీ చేపట్టారు. ఈసారి యోగిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి 2024 పార్లమెంటు ఎన్నికలకు భాజపా వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం మోదీ వయసు 71 ఏళ్లు.. యోగికి 49 సంవత్సరాలు. దీంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భాజపా.. యోగినే ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నా ఆశ్చర్యమేమీ లేదు.
మోదీ పరిస్థితేంటి?
అమెరికా, రష్యా వంటి చాలా దేశాల్లో అధ్యక్ష పాలన ఉంది. కొన్ని దేశాల్లో అధ్యక్షుడు, ప్రధాని పదవి రెండు ఉన్నప్పటికీ.. అధ్యక్షుడికే ఎక్కువ అధికారం ఉంటుంది. ఇప్పుడు యోగిని ప్రధాని అభ్యర్థిగా పార్టీ భావిస్తే మోదీ కోసం.. అధ్యక్షుడు వంటి కొత్త పదవిని సృష్టించేందుకు కూడా భాజపా ఆలోచిస్తోందని సమాచారం. ఎందుకంటే మోదీ మేనియా, క్రేజ్ ఇంకా తగ్గలేదు అన్నది ఈ ఎన్నికలతో మళ్లీ రుజువైంది. ఏదిఏమైనా యోగి.. తదుపరి ప్రధాని అభ్యర్థి అని మాత్రం ప్రచారం పెద్ద ఎత్తునే సాగుతోంది.