Telangana News: తెలంగాణ ముఖ్య నేతల నామినేషన్.. 3 గంటలతో ముగియనున్న గడువు
Telangana Elections 2024: తెలంగాణలో నామినేషన్ల పర్వానికి గురువారంతో గడువు ముగియనుంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు వందలాది నామినేషన్లు దాఖలయ్యాయి.
Lok Sabha Elections 2024: తెలంగాణలో నామినేషన్ల పర్వానికి గురువారంతో గడువు ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు వందలాది మంది నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు గురువారం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి గురువారం నలుగురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేయనున్నారు. నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఽసిటింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు.
పెద్దపల్లి స్థానంపై సస్పెన్స్..
బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా గోమా శ్రీనివాస్‌ను పార్టీ ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆయనకు బీ ఫాం ఇవ్వలేదు. మరోవైపు సిటింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్.. కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ హై కమాండ్‌తో మాట్లాడి చెబుతానని.. కిషన్‌రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు కాకుండా గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారేదుకు ఆయన సిద్ధపడుతున్నారు. అయితే, బీజేపి అధిష్టానం సీటు కేటాయించడంపై స్పష్టతను ఇవ్వలేదు. దీంతో ఇక్కడ అభ్యర్థిగా ఎవరు ఉంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
478 మంది నామినేషన్లు దాఖలు..
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటి వరకు 478 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన స్థానానికి 13 మంది నామినేషన్లు వేశారు. మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సాధారణ, శశాంతి భద్రతల, ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. ఇదిలా, ఉంటే పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్న విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మే 12, జూన్ నాలుగో తేదీల్లో సెలవు దినాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేసేందుకు ఆయా విద్యా సంస్థలు, ప్రైవేటు సంస్థలకు ముందురోజు కూడా సెలవు ఇవ్వాలనే ఉద్ధేశంతోనే మే 12న సెలవుగా ప్రకటించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.