Mallikarjun Kharge: ఈ ఎన్నికలు మోదీ Vs రాహుల్ కాదు, ప్రధాని ఆయనే! మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
Loksabha Elections 2024: ముస్లింల ఓటు బ్యాంకుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. బిహార్ రాష్ట్రాన్ని, ప్రజలను మోదీ అవమానించారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
Mallikarjun Kharge about Loksabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఇప్పటికే ఆరు దశల్లో ఎన్నికలు ముగిశాయి. చివరి దశ పోలింగ్ జూన్ ఒకటో తేదీ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో ముస్లింల ఓటు బ్యాంకుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముస్లింల ఓటు బ్యాంక్ కోసం ఇండియా కూటమి ‘ముజ్రా డ్యాన్స్’ చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఖండించారు. ససరం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత, ‘ఇండియా’ కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరఫున ఆదివారం ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. మోదీ మత రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ముస్లింలపై వ్యాఖ్యలు చేయడం ద్వారా మోదీ బిహార్ రాష్ట్రాన్ని, ప్రజలను అవమానించారని విమర్శించారు.
మోదీ తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నారు!
ప్రధాని మోదీ తనను తాను తీస్‌మార్‌ఖాన్ అనుకొంటున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తీస్‌మార్‌ఖాన్‌లు అని ఖర్గే అన్నారు. గత ప్రధానులందరూ దేశాన్ని ప్రజాస్వామ్య బద్దంగా పాలించారని, కానీ మోదీ నియంతగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలకు కనీసం జీవించే హక్కు కూడా ఉండదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా అనుమతి ఉండదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీ కాదని, ప్రజలు వర్సెస్ మోదీయే అని అన్నారు. మోదీ కాంగ్రెస్ నేతలకు కనీసం గౌరవం ఇవ్వట్లేదని విమర్శించారు. ప్రధాని కేవలం ధనవంతులనే ఆలింగనం చేసుకొంటున్నారని, పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రధాని ఎవరో చెప్పిన ఖర్గే
చివరి దశ ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ఏడు లోక్‌సభ స్థానాలకు జూన్ ఒకటో తేదీ పోలింగ్ జరుగనుంది. సిమ్లాలో ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి విజయం సాధిస్తే ప్రధాని ఎవరని మీడియా ప్రతినిథులు ప్రశ్నించారు. ఖర్గే సమాధానమిస్తూ.. కౌన్ బనేగా కరోడ్‌పతి అని అడిగినట్లుందంటూ చమత్కరించారు. కూటమిలోని నాయకులు ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తారని, గతంలో ప్రధాని ఎవరో ముందుగా ప్రకటించకుండానే యూపీఏ అధికారంలో వచ్చిందని గుర్తు చేశారు.
మోదీ 2014, 2019 ఎన్నికల్లో హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గింపు ఏమయ్యాయని ప్రశ్నించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడం లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రకృతి విపత్తులతో హిమాచల్ ప్రదేశ్ వణికిపోతే ప్రజలను ఆదుకోలేదని మండిపడ్డారు. పైగా అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానకి యత్నించారని ఆరోపించారు.