ఓటర్ల జాబితాలో సవరణకు నూతన మార్గదర్శకాలు- ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియ ప్రారంభం
ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ల సేకరణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. నూతన మార్గదర్శకాలపై పోస్టర్లతో అవగాహన కల్పించనున్నారు.
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నూతన మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2021 డిసెంబర్ 30న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 సవరించారన్నారు. దీని ప్రకారం సెక్షన్-23 ప్రకారం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు, ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు తమ ఆధార్ నెంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
2023 మార్చి నాటికి ఆధార్ నెంబర్ సమర్పించాలి..
నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు తమ ఆధార్ నెంబర్‌ను 2023 మార్చి నాటికి ఎన్నికల అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్లను గుర్తించడానికి, ఓటర్ల జాబితాలో వ్యక్తులను గుర్తించడానికి ఈ ప్రక్రియ సహకరిస్తుందన్నారు. ఒక ఓటర్ పేరు ఒక నియోజకవర్గంలో కంటే ఎక్కువ నియోజక వర్గాల్లో నమోదు కాకుండా లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదు కాకుండా చూస్తుందన్నారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమని... ఆధార్ నంబర్‌ను సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలిగించటం ఉండదని మీనా స్పష్టం చేశారు.
ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నెంబర్ కోసం నూతనంగా ఫారమ్ 6బి ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘం. ఈసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్విఎస్పి, విహెచ్‌ఎ వెబ్ సైట్‌లలో నూతన ధరఖాస్తులు అందుబాటులో ఉంచారు. 6బి దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చు. ఎన్విఎస్పి, ఓటర్ల హెల్ప్లైన్ యాప్‌లో కూడా ఆధార్ నెంబర్ అనుసంధానించవచ్చు.
అవసరమైన పత్రాలతో ఫారమ్ 6బిని ఆన్లైన్లో సమర్పించవచ్చు. బూత్ లెవల్ అధికారి ఇంటింటి సర్వే నిర్వహించి ఆధార్ సేకరిస్తారు. ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారు. ఆధార్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేని వాళ్లు ఫారం 6బిలో పేర్కొన్న పదకొండు ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలి. ఆధార్ నెంబర్ సేకరణ, నిర్వహణ కోసం అన్నిజాగ్రత్తలు తీసుకుంటారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇచ్చే సమాచారం బయటకు వెళ్లదని ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు ఇఆర్ఓల ద్వారా డబుల్ లాక్‌తో సురక్షితమైన కస్టడీలో ఉంచనున్నారు. యుఐడిఎఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ నియమించిన లైసెన్స్ పొందిన వ్యక్తులే ఓటర్ల ఆధార్ నంబర్‌ను అనుసంధానిస్తారన్నారు మీనా.
ఈ నూతన మార్గదర్శకాలపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను డిప్యూటీ సి.ఇ.ఓ. వెంకటేశ్వరరావు సోమవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్‌లో ఆవిష్కరించారు.