Tirupati News: ఐఏఎస్ అధికారి గిరీషాకు కాస్త ఊరట- సస్పెన్షన్ ఎత్తివేత
Elections 2024: తిరుపతి ఉపఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంతో సస్పెండ్ అయిన గిరీషాపై సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
Andhra Pradesh News: ఓ ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ వేటు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. విచారణ కొనసాగుతుండగానే ఆయనపై సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తేసింది. తిరుపతిలో 2021లో ఎంపీ ఉపఎన్నికల్లో జరిగాయి. ఆ సమయంలో ఈఆర్వోగా ఉన్నారు అప్పటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీషా. ఆయన లాగిన్ నుంచి బోగస్ ఓట్లకు సంబంధించి ఎపిక్ కార్డులు వ్యవహారంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. సుమారు 35వేల దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ఈఆర్వో లాగిన్ నుంచి డౌన్ లోడ్ చేసినట్లు గుర్తించిన ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్ చేసింది.
గిరీషాతోపాటు ప్రమేయం ఉన్న మరికొంత మందిపై కేసు నమోదు అయింది. ఈ క్రమంలో 3 నెలల పాటు విచారణ అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఈఆర్వోగా చలామణి అవుతూ కమిషనర్ లాగిన్ నుంచి డౌన్ లోడ్ చేసినట్లు తేల్చారు. దీంతో పీఎస్ గిరీషా సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. విచారణ మాత్రం పెండింగ్‌లో ఉందని స్పష్టం చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించరాదని, ఎన్నికలకు సంబంధం లేని విభాగానికిల కేటాయించాలని తెలిపింది.
కారకులు ఎవరు?
తిరుపతి ఉపఎన్నికల్లో బోగస్ ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం 35వేల దొంగ ఓట్ల నమోదు చేశారని ప్రకటించింది. అయితే దానికి కారణమైన వారు ఎవరు.. ఎవరి ప్రోద్బలంతో ఈ పనికి అధికారులు చేసారు అనేది స్పష్టత రాలేదు. 2021లో ఎన్నికలు జరిగితే 2024లో యాక్షన్ తీసుకోవడం పై కొంత వ్యతిరేకంగా ఉన్న ఇప్పటికైన కేంద్ర ఎన్నికల సంఘం కదిలింది అనే మాటలు వినిపించాయి. అయితే అధికారుల వెనుక ఉన్న వారి గురించి బయటపెట్టి వారిపై ఎన్నికల ఆనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
నలుగురు అధికారులకు పోస్టింగ్స్
మరోవైపు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నరన్న కారణంతో బదిలీ చేసిన ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. జి, లక్ష్మీషాను ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోగా పోస్టింగ్ ఇచ్చింది. పి రాజబాబుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా చేసింది. గౌతమికి టీటీడీ జేఈవోగా బాధ్యతలు అప్పగించింది. అంబేడ్కర్‌ను మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల పరిశుభ్రత కార్పొరేషన్ డైరెక్టర్‌గా పంపింది.