Supreme Court: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ - కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దంటూ ఆంక్షలు
Andhra Pradesh News: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన్ను కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించింది.
Supreme Court Restrictions To Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. మంగళవారం కౌంటింగ్ సందర్భంగా లెక్కింపు కేంద్రంలోకి వెళ్లకూడదని ఆయనపై సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశించింది. పాల్వాయిగేట్ టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం న్యాయస్థానం విచారించింది. ఈ నెల 6 వరకూ పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎత్తేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు హత్యాయత్నం చేశారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, కౌంటింగ్ రోజు కూడా ఆయన హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, పోలింగ్ సమయంలో మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వైరల్ అవుతోన్న వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు అందించారు. అయితే, ఇది అధికారిక వీడియో కాదంటూ పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదించారు. కాగా, అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయంటూ తెలిపిన బెంచ్.. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రజా ప్రతినిధిగా ఉండి.. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇలా ఈవీఎం ధ్వంసం చేయడం ఏంటి.? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది. పిన్నెల్లి కౌంటింగ్ పరిసరాల్లోకి కూడా వెళ్లకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అటు, ఈ నెల 6 వరకూ పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అభిప్రాయపడింది.
ఇదీ జరిగింది
మే 13న పోలింగ్ డే సందర్భంగా ఏపీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతుండగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కేసు నమోదు సహా చర్యలకు ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసింది. అయితే, దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై విచారించిన హైకోర్టు జూన్ 6 వరకూ ఆయన్ను అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. అటు, ఈవీఎం ధ్వంసం కేసు సహా పిన్నెల్లిపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అనుసరించిన షరతులే ఈ మూడు కేసుల్లో కూడా వర్తిస్తాయని కోర్టు తేల్చిచెప్పింది.
ఈ క్రమంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈవీఎం ధ్వంసం సహా తనపై హత్యాయత్నం చేశారని.. తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పిన్నెల్లిపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.