Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Pawan Kalyan News: పిఠాపురంలో రాజకీయం మరో మలుపు తిరిగింది. పవన్ పేరుతో పలువురు నామినేషన్ వేశారు. వాళ్లకు గ్లాస్ గుర్తును పోలిన సింబల్స్ ఇవ్వడం కలకలం రేపుతోంది.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తైతే... పిఠాపురంలో జరిగే ఎన్నికలు మరో ఎత్తు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేస్తుండటంతో ఎక్కడలేని ఉత్కంఠ నెలకొంది. గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్... ఈసారి ఏం చేస్తారో అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. అదే ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. ఆయనే గెలవలేని పరిస్థితుల్లో పార్టీని ఎలా నడుపుతారు... అభ్యర్థులను ఎలా గెలిపించుకుంటారనే విమర్శలు వినిపించాయి. అందుకే ఈసారి కచ్చితంగా విజయం సాధించాలన్న కసితో ఉన్న పవన్ కల్యాణ్... పిఠాపురాన్ని బాటిల్ గ్రౌండ్‌గా ఎంచుకున్నారు.
కాపులు అధిక సంఖ్యలో ఉన్న పిఠాపురంలో పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో పవన్ కల్యాణ్ అక్కడ పోటీకి సిద్ధపడ్డారు. నామినేషన్ కూడా వేశారు. ఆయనపై వైసీపీ తరఫున ఎంపీ వంగ గీత పోటీ చేస్తున్నారు. పవన్‌ను ఈసారి కూడా ఓడించి ఆయన్ని మరింత దెబ్బ తీయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. దీని కోసం ఉన్న అవకాశాలన్నింటీనీ వాడుకుంటోంది. అన్ని బలాలను ప్రయోగిస్తోంది.
నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. మరి రెండు రోజుల్లో పోటీలో ఉన్న వారి జాబితా కూడా వెలువడనుంది. అయితే ఇప్పటికే నామినేషన్లు వేసిన వారి పేర్లు, వారు ఎంచుకున్న గుర్తులు ఆధారాంగా మోడల్ బ్యాలెట్ వైరల్‌గా మారుతోంది. అది చూసిన జనసైనికులు, నేతలు కాస్త టెన్షన్ పడుతున్నారు.
మూడు పేర్లతో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ మోడల్ బ్యాలెట్‌లో ఉన్న పేర్లు అన్ని కూడా పవన్ కల్యాణ్‌వే. ఇంటి పేరు కూడా దరిదాపుల్లోనే ఉంది. గుర్తులు కూడా గ్లాస్ గుర్తునే పోలి ఉన్నాయి. ఐదో నెంబర్‌లో ఉన్న కోనేటి పవన్ కల్యాణ్ అనే వ్యక్తి గుర్తు బకెట్, ఆరో నెంబర్‌లో కొణిదెల పవన్ కల్యాణ్ ఆయనకు కేటాయించిన గుర్తు గ్లాస్, ఏడో నెంబర్‌లో కూడా కనుమూరి పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నామినేషన్ వేసి ఉన్నాడు. ఆయన కూడా ఓ గ్లాస్ గుర్తును పోలి ఉన్న గుర్తునే తీసుకున్నాడు.
ఏడో నెంబర్‌లో ఉన్న జనసేన గ్లాస్ గుర్తును మిగిలిన రెండు గుర్తులు డామినేట్ చేస్తున్నాయి. ఇదే ఓటింగ్ సమయంలో అయోమయానికి గురి చేస్తుందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు గ్లాస్ గుర్తు వెతికేందుకు టైం పడుతుందని అలాంటి సమయంలో వేరే గుర్తుపై ఓటు వేసే ఛాన్స్ ఉందంటున్నారు. పూర్తి స్థాయి జాబితా వస్తే దీనిపై ఫిర్యాదు చేయాలని జనసేన భావిస్తోంది. ఇప్పటికే ఈ గుర్తులపై సోషల్ మీడియో జనసైనికులు విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ కుట్రల్లో బాగంగా ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు.
ఈ గుర్తుల కన్ఫ్యూజన్ ఇప్పటి చాలా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నష్టపోయాయి. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తును పోలి ఉన్న గుర్తులు ఎవరికీ కేటాయించ వద్దని బీఆర్‌ఎస్ లీడర్లు ఎన్నికల సంఘంతో ఫైట్ చేశారు. ఇదే కాదు... గుర్తు ఓకే కనీసం పేరు చూసైనా ఓటు వేస్తారు అనుకుంటే ఒకటే ఇంటిపేరు... మనిషి పేరుతో ఎక్కువ మందితో ప్రత్యర్థులు ప్రయోగాలు చేస్తుంటారు. దీన్ని కూడా నిలువరించలేని పరిస్థితి ఉంటుంది. అందుకే గుర్తులపై పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ పోస్ట్ ఎంత వరకు నిజమో తెలియదు. కానీ జనసైనికుల్లో మాత్రం కాక రాజేస్తోంది.