Mahasena Rajesh: టీడీపీకి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మహాసేన రాజేష్- రెబల్‌గా పోటీకి సిద్ధం
Andhra Pradesh News: మహాసేన రాజేశ్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. బీజేపీని ఎదిరించే దమ్ము రాష్ట్ర పార్టీలకు లేదని చెబుతూ రెబల్‌గా పోటీకి సిద్ధపడుతున్నారు.
మహాసేన రాజేష్. ఈ మధ్య రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు. మొన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసిన ఈయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. పీ గన్నవరంలో టీడీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత మారిన పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్న రాజేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాంబు పేల్చారు.
మహాసేన రాజేష్ తిరుగుబాటు
ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే తనకు మంచి పదవే వస్తుందని చెబుతూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని ఎదిరించే పార్టీ లేదంటూ అందరిపై ఆరోపణలు చేశారు. ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీజేపీకే మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పుకొచ్చారు.
మహాసేన రాజేష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఏం రాసుకొచ్చారంటే..."నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్‌ని. ఎస్సీకి TDP రాష్ట్ర లీడర్‌ని. మా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేద స్టేట్ ఛైర్మన్ అవుతాను. అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబుకి క్షమాపణ చెప్పి పార్టీ నుండి బయటకు రావడానికి సిద్ధం.
కారణం?
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం. దేశమంతా ప్రతీ పార్టీకి ప్రతిపక్షం ఉంది. గుజరాత్‌లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులు. కానీ ఆంధ్రలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు. ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమే. ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు. ఈ కారణంగా మేం 2024 ఎలక్షన్‌లో మాకు అవకాశం ఉన్న ప్రతీ నియోజకవర్గంలో పోటీకి దిగాలని అనుకుంటున్నాం.
సిద్ధమైతే వాట్సాప్ చేయండి
ఇప్పటికీ దాదాపు 100నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమయ్యాం. ఇది పదవి కోసం కాదు.. మా ఆత్మగౌరవం కోసం మాత్రమే. మాతోపాటు పోటీ చేసి శాంతియుత నిరసన తెలియజేయాలి అనుకున్న వారు మీ వివరాలు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 9441093816 మాతో కలిసి పోటీ చేసి మీ నిరసన తెలియజేయాలనుకున్న"రాజులైన యాజక సమూహానికి (పాస్టర్లు).. చరిత్రలో దేశాన్ని పరిపాలించిన నవాబులకు(ముస్లింలు)..దళిత వీరులకు, సెక్యులర్ హైందవ వీరులకు ఇదే మా ఆహ్వానం".. మేము వైసీపీకి టీడీపీకి, బీజేపీకి, జనసేనకు ఇలా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు.
ఆత్మగౌరవ పోరాటం
ఈ పోరాటం కేవలం మా ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం మాత్రమే. క్రైస్తవులు, దళితులు జనరల్ సీట్లలో పోటీకి దిగుతారు. రాష్ట్రంలో 50సీట్లలో ముస్లిం సోదరులు పోటీపడతారు. ఇదొక చరిత్ర అయ్యే ఛాన్స్ వుంది. మేము కూటమి రెబల్స్‌గా పోటీకి దిగుతున్నాం కాబట్టి కూటమి ఓటు చీలి వైసీపీకి మేలు జరగొచ్చు. మేము క్రైస్తవ, దళిత, ముస్లిం, సెక్యూలర్ హిందువుల తరపున పోటీకి దిగుతున్నాం కాబట్టి వైసీపీ ఓటు చీలి కూటమికి మేలు జరగొచ్చు. లేదా మాకు ఓట్లు పడక మేము అవమానం పాలు కావొచ్చు. ఏం జరిగినా 175/175కి మేము పోటీపడటానికి మాత్రం ప్రయత్నిస్తాం. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి." అంటూ రాసుకొచ్చారు.