Maharashtra Assembly Election Result 2024: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!
Maharashtra New CM Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ సునామీ విజయాన్ని అందుకోబోతోంది. దీంతో లెక్కలు మారిపోతున్నాయి. సీఎంగా ఫడ్నవీస్ ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది
Maharashtra new cm 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న మహాకూటమిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే చర్చ మొదలైంది. ఈ రేసులో మాజీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ మొదటి ప్లేస్‌లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అనుకోని ఫలితాలు సాధించలేని స్థితి నుంచి ఆరు నెలల వ్యవధిలోనే అద్భుతమైన రిజల్ట్స్‌కు ఆయన కారణంగా అభిప్రాయం వ్యక్తమవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యాన్ని పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అద్భుతం చేసింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రావడం మొదలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి మూడు గంటల్లో మహాయుతికి భారీ విజయం ఖాయమనే రీతిలో ఫలితాలు వస్తున్నాయి.
బీజేపీ సమష్టి విజయం
ఎన్నికలకు ముందు మహాయుతి ప్రభుత్వం అమలు చేసిన లడ్కీ బహిన్ యోజన గేమ్ ఛేంజర్‌గా మారిందని ఫలితాలను బట్టి తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరైన అభ్యర్థుల ఎంపిక, గ్రౌండ్ లెవెల్లో శ్రేణుల కృషి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతు కారణంగా బిజెపి అద్భుతమైన విజయాన్ని సాధించింది.
బీజేపీ సునామీ
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం చాలా ముఖ్యమైంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ అభ్యర్థులు 120 స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇది ఇప్పటి వరకు బీజేపీ సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే చర్చ మొదలైంది. మహాకూటమిలో బీజేపీ 131 స్థానాల్లో, షిండే సేన 55 స్థానాల్లో, అజిత్ పవార్ వర్గం 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మహావికాస్ అఘాడి అభ్యర్థులు 60 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌లో 22 మంది అభ్యర్థులు, థాకరే గ్రూపులో 20 మంది అభ్యర్థులు, శరద్ పవార్ గ్రూపులో 16 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోనే ఎన్నికలకు
ఏక్‌నాథ్ షిండేతో కలిసి రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే నియమితులయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్ల మార్కు దాటడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి స్థానంలో బీజేపీ నేతను కూర్చోబెట్టే అవకాశం ఎక్కువగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత అమాంతం పెరిగిన గ్రాఫ్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లనున్నారనే చర్చ సాగింది. లోక్‌సభ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విఫలమైతే, దేవేంద్ర ఫడ్నవీస్ ఇమేజ్‌కి భారీ దెబ్బ తగిలి ఉండేది. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.