Chhattisgarh Polls: భూపేష్ బఘేల్ ప్రభుత్వ అవినీతిపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన అమిత్ షా
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై ఫైరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. భూపేష్ బఘేల్ సర్కార్ అవినీతిపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ఘాటు వ్యాఖ్యలతో విమర్శనాస్త్రాలు సంధించారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీ కా దర్బార్ రాష్ట్రానికి ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో బఘేల్ సర్కార్‌పై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఛార్జ్‌షీట్ విడుదల చేసినట్టు చెప్పారాయన. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. భూపేష్ బఘేల్.. ఛత్తీస్‌గఢ్‌ను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మార్చేశారని ఆరోపించారు. బొగ్గు, మద్యం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు కూడా పాల్పడుతున్నారని విమర్శించారు. వేల కోట్ల అవినీతికి పాల్పడిన భూపేష్ బఘేల్ ప్రభుత్వం కావాలా లేక ప్రజలు మంచి చేసే బీజేపీ ప్రభుత్వం కావాలో ఛత్తీస్‌గఢ్ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.
ఛత్తీస్‌గడ్ సీఎంగా రమణ సింగ్ పాలన సాగించిన సమయంలో... రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించిందని చెప్పారు. రమణసింగ్ సర్కార్ ప్రతి ఒక్కరికీ ఉచిత రేషన్ అందించిందని చెప్పారు. ప్రజలు ఆయన్ను చావల్ వాలే బాబా అన్న అన్నం ఉంచితంగా అందించే నాయకుడా అని కూడా పిలిచేవారి చెప్పారు. బీజేపీ పాలనలో పంచాయతీ ఛత్తీస్‌గఢ్ ఎడ్యుకేషన్ హబ్, పవర్ హబ్, సిమెంట్ హబ్ మరియు అల్యూమినియం హబ్‌గా గుర్తించబడిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం... ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయలేదన్నారు అమిత్ షా. స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని ఇబ్బందులు పెట్టిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులను నిరోధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మత మార్పిడులు విజృంభిస్తున్నా మాట్లాడకుండా మౌనం పాటిస్తున్న బఘేల్ ప్రభుత్వం కావాలా... లేదా గిరిజనులను, వారి సంస్కృతిని రక్షించే బీజేపీ ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏకధాటిగా విమర్శలు కురిపించారు అమిత్‌షా. అవినీతిలో బఘేల్ ప్రభుత్వం అన్ని రికార్డులను బద్దలుకొట్టిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అవినీతిపరులను, అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారయన. దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్రమ బెట్టింగ్ యాప్ అయిన మహదేవ్ ఆన్‌లైన్ బుక్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసును కూడా ప్రస్తావించారు అమిత్‌షా. యువతను ఆన్‌లైన్ బెట్టింగ్ వైపు నెట్టివేసే పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారా లేదా అభివృద్ధి కోసం కృషి చేసే బీజేపీని ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు అమిత్‌షా.
అవినీతివంతమైన భూపేష్ బఘేల్ ప్రభుత్వం నుంచి ఛత్తీస్‌గఢ్‌ను కాపాడదామని తాను రాష్ట్రానికి వచ్చానన్నారు అమిత్ షా. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్-NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు అమిత్‌షా. ఛత్తీస్‌గఢ్‌లోనూ బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 11 లోక్‌సభ స్థానాల్లో కాషాయ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని... అవినీతి కాంగ్రెస్‌ను అంతమొందించాలని పిలుపునిచ్చారు.